





Best Web Hosting Provider In India 2024

ది రాజా సాబ్తో ఇండియాలో ఏ నటుడికీ సాధ్యం కాని రికార్డును ప్రభాస్ అందుకోబోతున్నాడా.. అదే జరిగితే ఇండియాలోనే నంబర్ వన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో ఇండియాలో ఏ ఇతర నటుడికీ సాధ్యం కాని రికార్డును అందుకోబోతున్నాడా? ఈ సినిమాతో అతడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోగా నిలవనున్నాడా? ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చేస్తుంటే అది ఖాయంగా కనిపిస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్ సోమవారం (జూన్ 16) రిలీజైన విషయం తెలుసు కదా. ఈ టీజర్ తో ఇన్నాళ్లుగా సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు మరోసారి రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ నటుడికీ సాధ్యం కాని రికార్డును అందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.
వరుసగా నాలుగో సినిమా కూడా..
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రభాస్ గత మూడు సినిమాల్లాగే ఇండియాలో తొలి రోజు రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ నటుడు కూడా వరుసగా నాలుగు సినిమాల్లో తొలి రోజు రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధించలేదు.
ది రాజా సాబ్ కూడా తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లోనే కలిపి తొలి రోజు ఇండియాలో ఈ సినిమా ఈ రూ.50 ప్లస్ కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ గత మూడు సినిమాలు ఇలా..
బాహుబలి మూవీతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతడు ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మోస్తరు వసూళ్లు సాధిస్తూనే ఉన్నాయి. ఇక అతని చివరి మూడు సినిమాలు తొలి రోజే ఇండియా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధించాయి. ఆదిపురుష్ మూవీకి రూ.89 కోట్లు, సలార్ కు రూ.92 కోట్లు, కల్కి 2898 ఏడీకి రూ.93 కోట్లు వచ్చాయి.
గత రెండు సినిమాలు బ్లాక్బస్టర్ కావడంతో ఈ రాజా సాబ్ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన పాత స్టైల్లో కనిపిస్తున్నాడు. కొత్తగా హారర్ కామెడీ జానర్ ట్రై చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కూడా పక్కాగా తొలి రోజే ఇండియాలో రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధిస్తుందన్నది ఇండస్ట్రీ వర్గాల అంచనా.
ఆ తర్వాత మూవీ వసూళ్లు ఎలా ఉంటాయన్నది సినిమాకు వచ్చే టాక్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభాస్ సినిమాలకు గత కొన్నేళ్లుగా వస్తున్న ఓపెనింగ్స్ ను బట్టి చూస్తే.. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ నటుడికీ సాధ్యం కాని రికార్డును రెబల్ స్టార్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం