




Best Web Hosting Provider In India 2024

మీ పీరియడ్స్ ద్వారా పీసీఓఎస్ లక్షణాలను పసిగట్టవచ్చంటున్న గైనకాలజిస్ట్
మీ నెలసరి చక్రం పీసీఓఎస్‌ను ముందే ఎలా హెచ్చరిస్తుందో గైనకాలజిస్ట్ వివరించారు. మీ పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నా, అసలు రాకపోయినా దాన్ని లైట్ తీసుకోవద్దని హెచ్చరించారు.
మీ నెలసరి (పీరియడ్స్) కేవలం నెలకు ఒకసారి వచ్చిపోయేది కాదు. అది మీ హార్మోన్ల ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే ముఖ్యమైన సూచిక. నెలసరిలో ఏ చిన్న మార్పు వచ్చినా, అది శరీరంలో ఏదో లోపం ఉందని, దానిపై మనం శ్రద్ధ పెట్టాలని చెబుతుంది. అలాంటి ఒక సమస్యే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్). ఇది చాలామంది మహిళల్లో కనిపించే హార్మోన్ల సమస్య. దీని గురించి చాలామందికి సరిగా తెలీదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
వీరా హెల్త్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ మాన్సి వర్మ HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ, మీ నెలసరి చక్రం పీసీఓఎస్‌ను ముందే ఎలా హెచ్చరిస్తుందో వివరించారు. ఈ రోజుల్లో 51% మందికి పైగా మహిళలు పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు, యూటీఐలు (UTIs), పిల్లలు పుట్టకపోవడం లాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అందుకే, ఇలాంటి సమస్యల ప్రారంభ లక్షణాలను ముందే గుర్తించడం చాలా ముఖ్యం.
మీ శరీరంలో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వాటిని మామూలే అని వదిలేయకుండా, మీ శరీరం మీకు ఏమి చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మీకు బాగా సాయపడతాయి. దీనివల్ల మీరు త్వరగా జాగ్రత్తపడి, అవసరమైతే డాక్టర్ని సంప్రదించి, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
నెలసరి సరిగ్గా రాకపోతే హార్మోన్ల తేడా ఉండొచ్చు:
మీ పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నా, అసలు రాకపోయినా దాన్ని లైట్ తీసుకోవద్దు. నెలసరి రాకపోవడం లేదా సంవత్సరానికి 8 సార్ల కంటే తక్కువ పీరియడ్స్ రావడం పీసీఓఎస్ ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువ కావడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అండాలు విడుదల సరిగా జరగదు. దీనివల్ల గర్భాశయ పొర క్రమం తప్పకుండా బయటకు రాలేకపోతుంది. పీరియడ్ మిస్ అయిందంటే, ఏదో తేడా వచ్చిందని మీ శరీరం ముందుగానే చెప్పే సంకేతం.
ఎక్కువ రక్తస్రావం ఎప్పుడూ నార్మల్ కాదు:
చాలామంది అమ్మాయిలు, మహిళలు పీరియడ్స్ అప్పుడు ఎక్కువ రక్తస్రావం అయితే “నాకు మామూలుగానే ఇలా వస్తుంది” అని అనుకుంటారు. కానీ మీకు విపరీతంగా బ్లీడింగ్ అవుతుంటే, ప్రతి గంటకు శానిటరీ ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుంటే, లేదా పెద్ద పెద్ద రక్తం గడ్డలు పడుతుంటే, మీ హార్మోన్లు అదుపు తప్పాయని అర్థం. పీసీఓఎస్ ఉంటే నెలసరి ఎక్కువ రోజులు ఉండటం వల్ల గర్భాశయ పొర మందంగా తయారవుతుంది. అది ఒకేసారి బయటకు రావడంతో భారీగా, ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం జరుగుతుంది.
నొప్పి నెలసరి కేవలం కడుపునొప్పి కాకపోవచ్చు:
పీరియడ్స్ అప్పుడు కడుపు నొప్పి రావడం సాధారణమే. కానీ మీ నెలసరి నొప్పి మరీ ఎక్కువగా ఉండి, దానికి నెలసరి సక్రమంగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్ (అంటే కారణం లేకుండా కోపం, చిరాకు రావడం) కూడా తోడైతే, అది గర్భాశయంలోని వాపు, అండాశయాలలో సిస్ట్ (నీటి బుడగలు) ఏర్పడటంతో సంబంధం కలిగి ఉండొచ్చు. నెలసరి నొప్పికి పీసీఓఎస్ ఒక్కటే కారణం కానప్పటికీ, నొప్పి నిరంతరం ఉండి, ఇతర లక్షణాలతో కలిపి ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
నెలసరి మధ్యలో స్పాటింగ్ డేంజర్ బెల్:
నెలసరి మధ్యలో అసాధారణంగా బ్లీడింగ్ అవడం, ముఖ్యంగా ఇది తరచుగా లేదా ఎప్పుడు అవుతుందో తెలీకుండా ఉంటే, అది హార్మోన్ల హెచ్చుతగ్గులు లేదా గర్భాశయ పొర సరిగా ఊడిపోకపోవడాన్ని సూచిస్తుంది. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెలసరిని నియంత్రించే హార్మోన్ల సిస్టమ్ దెబ్బతింటుంది.
నెలసరి చక్రం ఎక్కువ రోజులు ఉందా? అండాలు విడుదల కాకపోవచ్చు:
సాధారణంగా ఆరోగ్యకరమైన నెలసరి చక్రం 21 నుండి 35 రోజులు ఉంటుంది. మీ నెలసరి క్రమం తప్పకుండా ఎక్కువ రోజులు వస్తుంటే లేదా ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే మీరు దాన్ని అస్సలు ట్రాక్ చేయలేకపోతే, మీకు క్రమం తప్పకుండా అండాలు విడుదల కావడం లేదని అర్థం. పీసీఓఎస్ తరచుగా అండోత్పత్తి లేని చక్రాలకు దారితీస్తుంది. ఇది పిల్లలు పుట్టే సామర్థ్యం (ఫెర్టిలిటీ), హార్మోన్ల కంట్రోల్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది.
మొటిమలు, వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతున్నాయా?
మీ నెలసరి సరిగ్గా రాకపోతే, మీకు దవడ భాగంలో మొటిమలు, ముఖం, శరీరంపై అధిక రోమాలు, లేదా తలపై జుట్టు పలచబడటం వంటివి కనిపిస్తే, అది శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు. ఇది పీసీఓఎస్ ముఖ్య లక్షణం. వీటిని చాలాసార్లు కేవలం అందానికి సంబంధించిన సమస్యలుగా తీసిపారేస్తారు. కానీ ఇవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి.
నెలసరిలో వచ్చే తేడాలు కేవలం నెలకు ఒకసారి వచ్చే చిన్న ఇబ్బందులు మాత్రమే కాదు.. మీ శరీరం మీకు సహాయం కావాలని అడుగుతున్న సంకేతాలు. ఆలస్యమైన నెలసరి, అధిక రక్తస్రావం లేదా హార్మోన్ల మొటిమలు వంటివి పీసీఓఎస్ లాంటి సమస్యలకు ముందుగానే సూచనలు కావచ్చు. ఈ సంకేతాలను త్వరగా గుర్తించి, సరైన జీవనశైలి మార్పులు చేసుకుని, అవసరమైన సప్లిమెంట్లు తీసుకుంటే, మీరు మీ హార్మోన్లను సమతుల్యం చేసుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది డాక్టర్ ఇచ్చే వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.)