


Best Web Hosting Provider In India 2024

మహేశ్వరి చీరల చరిత్ర: నర్మదా నది ఒడ్డున నేసిన సంస్కృతికి ప్రతీక
మధ్యప్రదేశ్‌కు గర్వకారణమైన మహేశ్వరి చీరల గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ అద్భుతమైన వస్త్రం ఓ కళాఖండంగా ఎలా మారిందో తెలుసుకుందామా? అయితే ఇక్కడ చూడండి.
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ప్రశాంతమైన ఒడ్డున, అహల్యా కోటతో అలరారే మహేశ్వర్ అనే చారిత్రక పట్టణం ఉంది. ఇక్కడ నేతమగ్గాల శబ్దం, ఐదు వేల ఏళ్ల చరిత్ర ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ పవిత్ర భూమిలోనే ప్రసిద్ధి చెందిన మహేశ్వరి చీర పుట్టింది. ఇక్కడి ప్రజల వారసత్వం, రాజభవనం, చరిత్ర ఈ చేనేత కళాఖండంలో ముడిపడి ఉన్నాయి.
మహేశ్వర్ ఘాట్ల గుండా నడుస్తుంటే ఇళ్లలో, వర్క్‌షాప్‌లలో చెక్క షటిల్స్ (కుదుళ్లు) లయబద్ధంగా కదులుతున్న మృదువైన శబ్దం వినిపిస్తుంది. ఈ అందమైన మహేశ్వరి చీరలను తయారు చేయడానికి పగలు రాత్రి కష్టపడే నైపుణ్యం కలిగిన చేనేత కార్మికుల శ్రమకు ఆ శబ్దాలు నిదర్శనం.
మహేశ్వరి చీరల గురించి మీకు తెలియని విషయాలు
మహేశ్వర్ 18వ శతాబ్దంలో తన అద్భుతమైన వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. అప్పుడు ప్రసిద్ధ మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, తన రాజధానిలో నేత పనిని ప్రారంభించడానికి సూరత్, దక్షిణ భారతదేశం నుండి నైపుణ్యం కలిగిన నేత కార్మికులను ఆహ్వానించింది. ఆమె కల కేవలం స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం మాత్రమే కాదు.. తన ఆస్థానం సొగసును, నర్మదా ప్రశాంతతను ప్రతిబింబించే ఒక వస్త్రాన్ని సృష్టించడం. అలా పుట్టిందే మహేశ్వరి చీర. ఇది గుసగుసలాడినంత తేలికగా, డిజైన్‌లో ధైర్యంగా, శైలిలో శాశ్వతంగా ఉంటుంది.
ప్రతి చీరను మొదట కాటన్, పట్టు దారాలతో నేసేవారు. దేవాలయాలు, ఘాట్లు, పవిత్ర నది అలల నుండి ప్రేరణ పొందిన నమూనాలతో రూపొందేవి. నేటికీ లహరియా (అల), చటై (పట్టీ), ఫూల్ (పువ్వు) నమూనాలు మహేశ్వర్ నిర్మాణ వైభవాన్ని తెలియజేస్తాయి.
మహేశ్వరి చీరలు మామూలు చీరల కంటే ఎందుకు భిన్నం
మహేశ్వరి చీరలను ప్రత్యేకంగా నిలబెట్టేవి వాటి తేలికైన అల్లిక. సాధారణంగా వీటిని కాటన్, పట్టు మిశ్రమంతో నేస్తారు. అలాగే, వాటి ప్రత్యేకమైన అంచు (బోర్డర్) జరీతో, నెమలి నీలం, చిలుక పచ్చ, ముదురు మెరూన్, బంగారు రంగు వంటి సొగసైన షేడ్స్‌లో తయారవుతాయి.
అందమైన చీరల వెనుక ఉన్న కళాకారులను కలుద్దాం
హస్మద్ అన్సారీ, అసిమ్ అన్సారీ… తండ్రీకొడుకులైన వీళ్లిద్దరూ 40 ఏళ్లకు పైగా మహేశ్వరి చీరల తయారీ వ్యాపారంలో ఉన్నారు. హస్మద్ అన్సారీ తండ్రి ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు అసిమ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
వారు ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుండి ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదని అన్సారీ కుటుంబంతో మాట్లాడినప్పుడు తెలిసింది. అసిమ్ అన్సారీ HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ, “మేం నేతమగ్గాలను మా ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాం. ముడిసరుకులు సేకరించడం నుండి నేయడం వరకు అన్నీ ఒకే చోట జరుగుతాయి” అని చెప్పారు.
నేత మగ్గం ఏర్పాటు చేయడానికి మొదట్లో చాలా కష్టం, పెట్టుబడి అవసరమయ్యాయి. వ్యాపారం పెరిగిన తర్వాత వారు 200 మగ్గాలను, 200 మందికి పైగా నేత కార్మికులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
మనుబాయి కేవట్ సుమారు 50 ఏళ్ల వయసున్న మహిళ. దాదాపు 30 సంవత్సరాలుగా చీరలు నేస్తోంది. తన కుమారుడు, కోడలు, పక్షవాతంతో బాధపడుతున్న భర్తతో సహా నేత పని తన కుటుంబాన్ని పోషించడానికి సహాయపడుతుందని ఆమె చెప్పింది.
సొంత చేనేత మగ్గాలు నడుపుతున్న ఇద్దరు అన్నదమ్ములు అబ్దుల్ అన్సారీ, నజర్ అన్సారీ 30 ఏళ్లకు పైగా ఈ పని చేస్తున్నామని చెప్పారు. ఈ నైపుణ్యాన్ని తమ కొడుకులకు కూడా నేర్పించాలనుకుంటున్నారు.
చూడటానికి తేలికగా అనిపించినా మహేశ్వరి చీరలను తయారు చేయడానికి చాలా కృషి, సమయం, ఓర్పు, నైపుణ్యాలు అవసరం. ప్రతి చీరను పూర్తి చేయడానికి రోజులు, కొన్నిసార్లు వారాలు పడుతుంది.
చీర తయారీ ముడిసరుకుల సేకరణతో ప్రారంభమవుతుంది. కాటన్ దారం నుండి జరీ దారం వరకు ప్రతిదీ భారతదేశం నలుమూలల నుండి సేకరిస్తారు. ఈ చేనేత వస్త్ర వారసత్వానికి మద్దతు ఇస్తున్న భారతీయ రిటైల్ చైన్ ఫాబ్‌ఇండియా ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్న దాని ప్రకారం కాటన్ ఎక్కువగా కోయంబత్తూర్ నుండి, జరీ సూరత్ నుండి, పట్టు బెంగళూరు నుండి సేకరిస్తారు.
మహేశ్వరి చీరల పరిణామ క్రమం
18వ శతాబ్దం చివరలో రాణి అహల్యాబాయి హోల్కర్ ఆసక్తితో మొదలైన మహేశ్వరి చీర.. వలసరాజ్యాల కాలంలో, స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి చెందింది. దాని రాజరిక రూపు బ్రిటిష్ గృహాలలో కూడా చాలా ఇష్టమైనదిగా మారింది. భారతీయ చేనేత పరిశ్రమలో కూడా విస్తృత మార్పు వచ్చింది.
ప్రభుత్వం చేతివృత్తులను గుర్తించడంతో నేటి మహేశ్వరి చీరలు సాంస్కృతిక వారసత్వం, ఆధునికత కలయికగా మారాయి. చీర అంచుకు కొన్ని మార్పులు, చెక్స్, నమూనాలను ప్రవేశపెట్టినప్పటికీ అంచు, పల్లులు ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్నాయి.
నేడు మహేశ్వరి చీరలను ఉత్పత్తి చేసే పవర్‌లూమ్‌లు చాలా ఉన్నప్పటికీ, అసలైన చేనేత చీరలకు డిమాండ్ అలాగే ఉంది. ఇది నేత కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుంది. ఈ వస్త్ర తేలికపాటి స్వభావం దీనిని రోజువారీ దుస్తులుగా, అలాగే ఏ సందర్భానికైనా ధరించడానికి అనువైనదిగా మార్చింది.
కేవలం ఒక జ్ఞాపిక కాదు
ఈ రోజుల్లో మహేశ్వరి చీరలు అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో, ప్రత్యేకమైన బొటిక్ కలెక్షన్లలో తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. మహేశ్వర్‌లో మాత్రం అవి ఇప్పటికీ ఎంతో వ్యక్తిగతమైనవి. గర్వానికి, జీవనోపాధికి, సజీవ చరిత్రకు చిహ్నాలు. మహేశ్వర్‌కు వచ్చే పర్యాటకులు, రాజభవనం లోపల ఉన్న రెహ్వా సొసైటీ వంటి కేంద్రాలను సందర్శించి, నేత కార్మికులు పనిచేయడాన్ని చూడవచ్చు. అక్కడి నుండే నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.
కొందరు సందర్శకులు నేతమగ్గాలపై నేత నేసే ప్రయత్నం చేస్తే, మరికొందరు స్కార్ఫ్‌లు, దుపట్టాలు లేదా పురుషుల షర్టులు కూడా కొనుక్కుంటారు. మహేశ్వరి చీరలోని ప్రతి మడతతో మీరు నర్మదా నది తీరాన నేసిన, చరిత్రలో కుట్టిన, సొగసుతో చుట్టిన భారతదేశపు సజీవ సంప్రదాయాన్ని మీతో తీసుకువెళతారు.
టాపిక్