




Best Web Hosting Provider In India 2024

క్షమాపణ చెప్పాలనడం హైకోర్టు పని కాదు.. సినిమా రిలీజ్ చేయాల్సిందే: సుప్రీంకోర్టులో కమల్ హాసన్‌కు ఊరట
కమల్ హాసన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతని థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే క్షమాపణ చెప్పాల్సిందేనన్న హైకోర్టు అడగడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించలేదు.
నటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలోని థియేటర్లలో ప్రదర్శించకపోవడంపై సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని సూచించినందుకు కర్ణాటక హైకోర్టును కూడా తప్పుబట్టింది.
అది హైకోర్టు పని కాదు
థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక బ్యాన్ చేయడంపై కమల్ హాసన్ సుప్రీంకోర్టు వెళ్లాడు. దీనిపై మంగళవారం (జూన్ 17) విచారణ జరిగింది. క్షమాపణ చెప్పాలని అడగడం హైకోర్టు పని కాదని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించిన పీటీఐ రిపోర్టు వెల్లడించింది. “అతని నుంచి క్షమాపణ కోరడం హైకోర్టు పని కాదు” అని జస్టిస్ మన్మోహన్ ఈ సందర్భంగా అన్నారు.
కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) సహా అక్కడి కన్నడ సంఘాలను ఆగ్రహానికి గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు క్షమాపణ చెప్పాలని, లేదంటే థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ కానివ్వబోమని హెచ్చరించారు. అక్కడి హైకోర్టుకు వెళ్లినా కమల్ కు ఊరట లభించలేదు. హైకోర్టు కూడా కమల్ కామెంట్స్ ను తప్పుబడుతూ.. క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది.
సినిమాను విడుదల చేయాల్సిందే
ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మోహన్ కీలకమైన కామెంట్స్ చేశారు. “చట్టం ప్రకారం సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందే. అలా జరిగేలా చూసుకునే బాధ్యత రాష్ట్రాలపై ఉంది. మీరు ప్రేక్షకుల తలలపై తుపాకీ పెట్టి సినిమా చూడొద్దని చెప్పలేరు.
థియేటర్లను తగలబెడతారన్నది చూపించి సినిమాను ప్రదర్శించలేమంటే కుదరదు. ప్రేక్షకులు సినిమా చూస్తారా లేదా అన్నది వాళ్ల ఇష్టం. వాళ్లు చూడాలని మేమేమీ ఆదేశించడం లేదు. కానీ సినిమాను మాత్రం విడుదల చేయాల్సిందే” అని మన్మోహన్ స్పష్టం చేశారు.
అసలేంటీ వివాదం?
థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో రిలీజైంది. అంతకుముందు మూవీ ప్రమోషన్లలో భాగంగా కర్ణాటక వెళ్లిన కమల్ హాసన్.. కన్నడ భాష పుట్టిందే తమిళం నుంచి అని అన్నాడు. దీనిపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే సినిమాను రిలీజ్ చేయనివ్వమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేసింది.
అటు హైకోర్టులోనూ కమల్ కు ఊరట లభించకపోవడంతో మూవీ అక్కడ రిలీజ్ కాలేదు. కమల్ ఈ వివాదంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చినా.. క్షమాపణ మాత్రం చెప్పనని స్పష్టంగా చెప్పాడు. కర్ణాటకలో మూవీని రిలీజ్ చేయకపోయినా సరే అని తేల్చి చెప్పాడు. ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీనికితోడు కర్ణాటకలో నిషేధం వల్ల కూడా మేకర్స్ భారీగానే నష్టపోయారు.
సంబంధిత కథనం