




Best Web Hosting Provider In India 2024

మీ టీనేజీ అమ్మాయికి జుట్టుకు నూనె పెట్టుకోవడం ఇష్టం లేదా? కొబ్బరి నూనె ఇప్పటికీ హీరోనే ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు అమ్మమ్మో, అమ్మో జుట్టుకు నూనె రాసి గోరువెచ్చగా మసాజ్ చేస్తే ఎంత హాయిగా ఉండేదో కదా? కానీ ఇప్పుడు టీనేజర్లకు అది అస్సలు నచ్చడం లేదు. నిజానికి, నూనె వాడకం గురించి సరైన విషయాలు తెలిస్తే వాళ్ళ అభిప్రాయం మారొచ్చు.
హైలీ బీబర్, బెల్లా హడిడ్ లాంటి సెలబ్రిటీలు చేసే ‘క్లీన్ గర్ల్’ హెయిర్‌స్టైల్స్ (జుట్టును వెనక్కి దువ్వి, జెల్ పెట్టి నున్నగా కట్టేసుకునేవి, లేదా మెరిసే పోనీటెయిల్స్) అంటే టీనేజర్లు పడిచచ్చిపోతారు. కానీ తలకు నూనె అనగానే మాత్రం ముఖం చిట్లించుకుంటారు. ఇది పూర్తిగా వాళ్ళ తప్పు కాదు లెండి. సోషల్ మీడియా ప్రభావం, పాశ్చాత్య జనాలు చేస్తేనే అది గొప్ప అన్నట్లుగా మన సంప్రదాయ పద్ధతులను కూడా మనం పట్టించుకోకపోవడమే దీనికి కారణం.
సాధారణంగా టీనేజర్లు తల నూనె అంటే జిడ్డుగా, అతుక్కున్నట్లు ఉంటుందని ఇష్టపడరు. నూనె వాడటం వల్ల కలిగే లాభాలు, దాని వెనుక ఉన్న సైన్స్ గురించి వాళ్ళు తెలుసుకుంటే, జుట్టుకు నూనె పట్ల వారి ఆలోచన కచ్చితంగా మారుతుంది.
మారికో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన డాక్టర్ శిల్పా వోరా HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ జుట్టుకు నూనె పెట్టకపోతే ఏమవుతుంది, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, సాధారణంగా ఉన్న అపోహలు ఏంటో వివరించారు.
టీనేజర్లు ఎక్కువగా బయట తిరుగుతారు కదా. స్కూలుకో, ట్యూషన్‌కో వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళ జుట్టు దుమ్ము, కాలుష్యం, ఎండ (UV కిరణాలు), వేడి, తేమ వంటి పర్యావరణ సమస్యలకు గురవుతుంది.
ఈ సమస్యల గురించి, వాటికి పరిష్కారం గురించి ఆమె ఇలా వివరించారు. “ఎక్కువగా బయట తిరగడం వల్ల టీనేజర్ల జుట్టు కాంతిని కోల్పోయి, డల్‌గా, పాడైపోయినట్లు కనిపిస్తుంది. దీనికి పరిష్కారం కొబ్బరి నూనె. టీనేజర్ల జుట్టుకు ఇది చాలా బాగా పని చేస్తుంది” అని వివరించారు.
“కొబ్బరి నూనె ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల అది జుట్టులోకి 10 పొరల లోతుగా చొచ్చుకుపోగలదు. ఇది జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. దానిలోని అణు నిర్మాణం, మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ వల్ల ఇది జుట్టుకు లోపలి నుండి పోషణ ఇస్తుంది. జుట్టుకు దీర్ఘకాలిక రక్షణ, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు ఒక రక్షణ కవచంలా కూడా పని చేస్తుంది. జుట్టును పాడవకుండా కాపాడుతుంది” అని తెలిపారు.
జుట్టుకు నూనె పెట్టడం వల్ల కలిగే లాభాలు, సాధారణ అపోహలను తొలగిస్తూ ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు.
జుట్టుకు నూనె పెట్టడం వల్ల కలిగే లాభాలు
జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టీనేజర్లకు ఇది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.
తల నూనెపై అపోహలు – నిజాలు
అపోహ 1: తలకు నూనె పెట్టడానికి చాలా సమయం పడుతుంది
నిజం: జుట్టుకు మంచి పోషణ అందించడానికి కేవలం 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయం నూనె పెడితే సరిపోతుంది. ఇది జుట్టును మెత్తగా, సులభంగా దువ్వగలిగేలా, ఆరోగ్యంగా చేస్తుంది. నూనె పూర్తి ప్రయోజనాలను పొందాలంటే, షాంపూ చేయడానికి ముందు క్రమం తప్పకుండా నూనె పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.
అపోహ 2: నూనె పెడితే నా తల జిడ్డుగా మారుతుంది
నిజం: తల జిడ్డుగా మారడానికి కారణం సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడమే. నూనె పెట్టుకోవడం కాదు. సెబమ్ అనేది మీ నెత్తి స్రవించే ఒక సహజమైన జిడ్డు లాంటి పదార్థం.
మార్కెట్లో చాలా రకాల నూనెలు ఉన్నాయి. వాటిలో తేలికైన, జిడ్డు లేని, సులభంగా కడిగివేయగలిగే మంచి కొబ్బరి నూనెను ఎంచుకోండి. కొబ్బరి నూనెలో ఉండే మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల అది జుట్టుకు అతుక్కుపోకుండా సులభంగా కడిగిపోతుంది.
అపోహ 3: నూనె పెడితే దుమ్ము పడుతుంది. మొటిమలు లేదా చుండ్రు వస్తాయి.
నిజం: అధ్యయనం ప్రకారం, నూనె రాసిన జుట్టుకు, నూనె లేని జుట్టుకు ఒకే రకంగా దుమ్ము పడుతుంది. కానీ అసలు తేడా జుట్టు కడిగిన తర్వాత తెలుస్తుంది. నూనె రాసిన జుట్టు నుంచి దుమ్ము సులభంగా పోతుంది. నూనె లేని జుట్టు కంటే కడిగిన తర్వాత చాలా శుభ్రంగా అనిపిస్తుంది.
కొబ్బరి నూనెలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల చుండ్రు లేదా మొటిమలు వచ్చే అవకాశం చాలా తక్కువ.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.)