





Best Web Hosting Provider In India 2024

సితారే జమీన్ పర్ రివ్యూ.. హృదయాన్ని కదిలించే కథ.. ఆమీర్ ఖాన్ సినిమా ఎలా ఉందంటే?
సితారే జమీన్ పర్.. భారీ అంచనాలతో, కొన్ని కాంట్రవర్సీల మధ్య థియేటర్లకు వచ్చింది ఈ సినిమా. ఈ రోజు (జూన్ 20) ఈ ఆమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జమీన్ పర్ కు సీక్వెల్ గా వచ్చిన మూవీ ఆడియన్స్ ను మెప్పించిందా? ఇక్కడ చూసేయండి.
సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ
దర్శకత్వం: ఆర్.ఎస్. ప్రసన్న
నటీనటులు: ఆమీర్ ఖాన్, జెనీలియా డిసోజా, అరౌష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భాన్సాలి, ఆశిష్ పెండ్సే
రేటింగ్: 3.5
గత కొన్ని వారాలుగా ఆమీర్ ఖాన్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆయన తన తాజా చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆయన తన సినిమాపై ఎంత నమ్మకం ఉంచుకున్నాడో ఈ ప్రమోషన్లు చూస్తే అర్థమవుతుంది. సితారే జమీన్ పర్ మూవీ శుక్రవారం (జూన్ 20) థియేటర్లకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ సినిమా రివ్యూ ఇక్కడ చూసేయండి.
యాక్టింగ్ అదుర్స్
2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ కి ఇది సీక్వెల్. 2018 ఇటాలియన్ సినిమా ‘కాంపియోన్స్’ కి ఇది అధికారిక అనువాదం. సితారే జమీన్ పర్ సినిమాలో ఆమీర్ ఖాన్ యాక్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమా అంటే చాలు ప్రాణం పెట్టే ఆమీర్ ఖాన్.. సితారే జమీన్ పర్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు.
కథ ఏమిటంటే?
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన సితారే జమీన్ పర్ లో విలన్ లేడు. అహంకారి బాస్కెట్‌బాల్ అసిస్టెంట్ కోచ్ గుల్షన్ అరోరా (ఆమీర్ ఖాన్) కోపంలో తన సీనియర్‌ను కొట్టినందుకు సస్పెండ్ అవుతాడు. తర్వాత, అతను తాగి పోలీసు వ్యాన్‌ను ఢీకొడతాడు. దీంతో మూడు నెలల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని జడ్జ్ శిక్ష విధిస్తారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు స్పెషల్ ఎబిలిటీస్ (ప్రత్యేక సామర్థ్యం) కలిగిన వారి బృందానికి బాస్కెట్‌బాల్ నేర్పించాలి.
మరి హీరో వాళ్లకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇచ్చాడా? ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న టీమ్ హీరోకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టారు? మరి ఆ టీమ్ విజేతగా నిలిచిందా? అన్నదే కథ.
హీరో షాక్
స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తులకు బాస్కెట్ బాల్ నేర్పించాలనే శిక్షతో గుల్షన్ అరోరా షాక్ అవుతాడు. అయిష్టంగా ఆ పనిని చేపడతాడు. ఈ ప్రత్యేక వ్యక్తుల బృందం తమ పరిస్థితులను తమ జీవితంలోని విలన్‌గా చూస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ రచయిత దివ్య నిధి శర్మ దీన్ని ఎలా వ్రాశారంటే తమ సామర్థ్యాన్ని వాడి గెలిచే గ్యాంగ్ గా వాళ్లు మారతారు. ఈ సినిమాలో ఎక్కడా దర్శకుడు సానుభూతి కార్డును ఆడటానికి ప్రయత్నించలేదు.
ఫస్ట్ ఆఫ్ ఇలా
ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తులు మనం వాళ్లపై జాలి పడాలని కోరుకోరు. సితారే జమీన్ పర్ మూవీ ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. ఓర్పును పరీక్షిస్తుంది. ఆమీర్ తన కొత్త పాత్రతో కోపంగా ఉండటం, తన ప్రత్యేక బృందాన్ని తెలుసుకోవడం, ఆపై సునీత (జెనీలియా దేశ్‌ముఖ్) తో తన వివాహం బంధంలో ఇబ్బందులు పడటం ఇలా కథ సాగుతుంది. మధ్యలో కామెడీ కూడా కాస్త వర్కౌట్ అయింది. అప్పుడప్పుడు నవ్వులు వస్తాయి.
కదిలించే సెకండాఫ్
సితారే జమీన్ పర్ మూవీ ఫస్టాఫ్ చూసిన తర్వాత కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాను నిలబెట్టింది. తన గ్రూప్ సిచ్యువేషన్ ను అర్థం చేసుకుని, హీరో కోచింగ్ స్టార్ట్ చేస్తాడు. కామెడీ కూడా ఉంటుంది. సితారే జమీన్ పర్ రెండవ భాగం చాలా నచ్చుతుంది. ఆమీర్ తనదైన కామెడీ జోనర్ లో నవ్విస్తాడు. అలాగే ఏడ్పిస్తాడు కూడా. భర్తకు సపోర్ట్ చేసే భార్యగా జెనీలియా అద్భుతంగా కనిపించింది.
తారలు వెలుగుతాయి
ఇక సితారే జమీన్ పర్ సినిమాలో స్పెషల్ ఎబిలిటీస్ పర్సన్స్ గా కనిపించే కొత్త నటీనటులు యాక్టింగ్ తో వెలిగిపోయారు. ఆశిష్ పెండ్సే సునీల్‌గా కీలక సన్నివేశంలో తన కదిలించే ప్రదర్శనతో మీ గుండెను గెలుచుకుంటాడు. అరౌష్ దత్తా, ఆయుష్ భాన్సాలి, రిషి షాహని, గోపీకృష్ణన్ కె వర్మ, రిషబ్ జైన్, వేదాంత్ శర్మ, సిమ్రాన్ మంగేష్కర్, సంవిత్ దేశాయ్, నమన్ మిశ్రా ఇలా అందరూ తమ మార్క్ చూపించారు. శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం ఉత్సాహంగా ఉంటుంది.
మొత్తంమీద, సితారే జమీన్ పర్ హృదయానికి హత్తుకునేది. పూర్తిగా నిండిన థియేటర్లో మూవీ చూడటం మంచిది. సామూహిక నవ్వులు, నిశ్శబ్ద కన్నీళ్లు లాంటివి సినిమా ప్రభావాన్ని పెంచుతాయి. తారే జమీన్ పర్ లా ఇది పూర్తి ప్రకాశవంతంగా వెలగలేకపోవచ్చు కానీ సితారే జమీన్ పర్ కు తనదైన కాంతి కచ్చితంగా ఉంటుంది.
సంబంధిత కథనం