



Best Web Hosting Provider In India 2024

విద్యార్థులకు యోగాతో అద్భుత ప్రయోజనాలు: మంచి నిద్ర, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత
ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరంలా మారుతోంది. మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎలా సహాయపడుతుందో నిపుణులు వివరిస్తున్నారు.
యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అశాంతిని తగ్గిస్తుంది. అంతేకాదు, విద్యార్థులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యోగా నేర్పుతుంది. 2024 హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం యోగా ఒత్తిడిని తగ్గించి, ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే, ఆందోళనను తగ్గించే GABA (గామా-అమినోబ్యుటిరిక్ యాసిడ్) అనే రసాయన స్థాయిలను పెంచుతుంది.
యోగాసనాలు శరీర వశ్యతను, సమతుల్యతను, బలాన్ని, మొత్తం శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు అభిజ్ఞా పనితీరును (cognitive function) మరింత మెరుగుపరుస్తాయని, మంచి విద్యా పనితీరుకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డయాబెటిక్ ఎడ్యుకేటర్, పీసీఓడీ, బరువు తగ్గించే నిపుణురాలు, డైట్రిఫిట్ వ్యవస్థాపకురాలు అబర్నా మతివానన్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, బెంగళూరులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రుమానా ఫాతిమా విద్యార్థులకు యోగా అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.
శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
“నేటి వేగవంతమైన ప్రపంచంలో, యువతకు యోగా ఎంతో అవసరమైన ఒక ‘పాజ్ బటన్’లా మారుతోంది. స్కూల్ డెడ్‌లైన్స్‌తో సతమతమయ్యే టీనేజర్ల నుండి స్క్రీన్ టైమ్‌లో మునిగిపోయిన యువ నిపుణుల వరకు, ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. కానీ ఇలా ఉండాల్సిన అవసరం లేదు. యోగా ఒక సున్నితమైన, శక్తివంతమైన విముక్తిని అందిస్తుంది” అని అబర్నా అన్నారు.
“శారీరకంగా చూస్తే, యోగా శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా బలం, వశ్యతను పెంచుతుంది. కొన్నిసార్లు మంచి కంటే చెడు చేసే హై-ఇంటెన్సిటీ వర్కవుట్ల మాదిరిగా కాకుండా, యోగా సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది” అని వివరించారు.
ఏకాగ్రత, దృష్టి పెరుగుతాయి
యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల యువత ఆందోళనను నియంత్రించుకోవచ్చునని అబర్నా చెప్పారు. ఏకాగ్రతను పెంచుకోవచ్చనని, నాణ్యమైన నిద్ర పొందవచ్చునని తెలిపారు. పరీక్షల ఒత్తిడిలో లేదా పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు ఈ ప్రయోజనాలు చాలా తేడాను చూపిస్తాయని చెప్పారు. “సాధారణ శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్ స్ట్రెచెస్ లేదా రోజుకు 20 నిమిషాల సెషన్ కూడా హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి, భంగిమ సంబంధిత నొప్పులను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పరచడానికి సహాయపడతాయి.” అని వివరించారు.
‘యోగా కేవలం ఒక వ్యాయామం కాదు. యువత తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక వరం లాంటిది. వేగంగా పరుగెత్తమని వారిని పురిగొల్పే ప్రపంచంలో యోగా నెమ్మదించి శ్వాస తీసుకోవడం నేర్పుతుంది” అని ఆమె చెప్పారు.
భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది
యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలలో భావోద్వేగ నియంత్రణను చాలా మంది పట్టించుకోరని రుమానా తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇది వర్తిస్తుందని, చాలా మంది యోగాను కేవలం శారీరక దారుఢ్యం లేదా వశ్యత కోణంలోనే చూస్తారని ఆమె అన్నారు. “పాఠశాల వాతావరణంలో, విద్యా సంబంధిత ఒత్తిళ్లు, తోటివారితో పోలికలు, స్క్రీన్ టైమ్ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని మరింత తెలివిగా ఎదుర్కోవడానికి యోగా పిల్లలకు సహాయపడుతుంది.” అని వివరించారు.
“సాధారణ మార్గదర్శక స్ట్రెచెస్, శ్వాస వ్యాయామాల ద్వారా, ప్రారంభ స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా తమ ఏకాగ్రత, శక్తి మానసిక స్థితిలో మెరుగుదల గమనించడం ప్రారంభిస్తారు. శ్వాస ఆందోళనకరమైన క్షణాలలో ఒక ఆధారంగా మారుతుంది. మనసు ఉద్వేగానికి లోనుకాకుండా ఆలోచనలను గమనించడం నేర్చుకుంటుంది..” అని వివరించారు.
స్వీయ-అవగాహన పెరుగుతుంది
పిల్లలు, విద్యార్థులకు యోగా ప్రయోజనాలు నిజంగా పరివర్తనాత్మకంగా ఉంటాయని రుమానా వివరించారు. “ఎంతో మంది అశాంతితో ఉన్న పిల్లలు యోగా వల్ల తరగతిలో శ్రద్ధగా పాల్గొనడాన్ని, సిగ్గుపడే విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండటాన్ని నేను చూశాను. అయితే ఈ మార్పులకు సమయం పడుతుంది. పిల్లలు ఇప్పుడు నిద్ర సమస్యలను ఎదుర్కోవడం లేదు. కోపాన్ని అధిగమించగలుగుతున్నారు..’ అని వివరించారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)