





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ఈ కన్నడ ఎమోషనల్ లీగల్ డ్రామా చూశారా.. కోర్టు ముందే అందరూ చూస్తుండగానే హత్య.. అయినా నిరపరాధే..
ఓటీటీలోకి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కన్నడ ఎమోషనల్ లీగల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కోర్టు ముందే అందరూ చూస్తుండగానే హత్య జరిగినా.. ఆ హత్య చేసిన వ్యక్తి నిరపరాధిగా తేలడమే ఈ మూవీలో హైలైట్ పాయింట్.
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి లీగల్ డ్రామాలు రావడం చాలా అరుదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 18న యుద్ధకాండ ఛాప్టర్ 2 పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమాను నిర్మించి, లీడ్ రోల్లో నటించాడు అజయ్ రావు. కేజీఎఫ్ స్టార్ అర్చన జోయిస్, ప్రకాశ్ బెలవాడి కీలకమైన పాత్రల్లో కనిపించారు. ప్రైమ్ వీడియోలోకి తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
యుద్ధకాండ ఛాప్టర్ 2 స్టోరీ ఏంటంటే?
కన్నడ భాషలో ఓ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2 సినిమా తెరకెక్కింది. పవన్ భట్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కోర్టు ముందే ఓ ఎమ్మెల్యే తమ్ముడిని హత్య చేసే ఓ యువతి, ఆమెను కాపాడటానికి ఓ యువ లాయర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది.
సినిమా మొదట్లోనే ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నివేదిత (అర్చన్ జోయిస్) అనే యువతి కోర్టు ముందే అందరూ చూస్తుండగానే ఓ పోలీస్ పిస్తోలుతో కాల్చి చంపుతుంది. ఇదో ఓపెన్ అండ్ షట్ కేసు అని అందరూ భావిస్తున్న సమయంలో ఓ మంచి కేసు కోసం ఎదురు చూస్తున్న యువ లాయర్ భరత్ హనుమంత్ (అజయ్ రావు) ఆమె తరఫున వాదించడానికి ముందుకు వస్తాడు. తన కూతురుపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని శిక్షించకుండా కోర్టులు కేసును సాగదీస్తుండటం వల్లే ఆమె ఈ పని చేసిందని అతడు తెలుసుకుంటాడు.
అయితే పట్టపగలు అదీ కోర్టు ముందే అందరూ చూస్తుండగానే ఈ హత్య చేసిన ఆమెను భరత్ కాపాడగలడా? కోర్టులో అతడు ఏం వాదించబోతున్నాడు? ఈ కేసులో తన గురువులాంటి వ్యక్తి, సీనియర్ లాయర్ రాబర్ట్ డిసౌజా (ప్రకాశ్ బెలవాడి)ను అతడు ఎలా ఎదుర్కోబోతున్నాడన్నది ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2 మూవీలో చూడాలి.
యుద్ధకాండ ఛాప్టర్ 2 ఎలా ఉందంటే?
సాధారణంగా ఏ లీగల్ డ్రామా అయినా కోర్టులో వాదనలతో చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2 కూడా అలాగే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కేసుల కోసం కిందామీదా పడే లీడ్ క్యారెక్టర్ భరత్ ను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్ సమయానికి కథకు కాస్త సీరియస్ టర్న్ ఇచ్చారు.
ఇంటర్వెల్ తర్వాతే అసలు కోర్ట్ రూమ్ డ్రామా మొదలవుతుంది. కోర్టు ముందే, అదీ ఓ ఎమ్మెల్యే తమ్ముడిని హత్య చేసిన యువతి తరఫున అసలు అతడు ఏం వాదిస్తాడు? ఆమెను ఎలా కాపాడతాడు అన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఈ పాయింట్ ను వాడుకునే డైరెక్టర్ పవన్ భట్ మూవీని ముందుకు నడిపించాడు. కొన్ని పాయింట్లు ఆసక్తికరంగానే అనిపిస్తాయి.
మెలో డ్రామా ఎక్కువైంది
అయితే కోర్టు వాదనలు, ఆధారాల కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకదశలో మెలో డ్రామా మరీ ఎక్కువైందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ మొత్తానికి క్లైమ్యాక్స్ వరకూ ఇంట్రెస్టింగ్ ట్విస్టులతోనే నడిపించాడు. లీడ్ క్యారెక్టర్ భరత్ పాత్రలో అజయ్ రావు జీవించేసినట్లు కనిపిస్తుంది.
ఇక అర్చన జోయిస్ కూడా తన పరిధి మేర బాగానే నటించింది. ఈ లీగల్ డ్రామాకు ఐఎండీబీలో ఏకంగా 8.9 రేటింగ్ రావడం విశేషం. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ వీకెండ్ ఓసారి ఈ మూవీ చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం