





Best Web Hosting Provider In India 2024

జగన్-కేసీఆర్ మొదలు పెట్టిన బనకచర్ల ప్రాజెక్టు మీద చంద్రబాబుకు ప్రేమ ఎందుకు… ఎవరి లాభాల కోసం లిఫ్ట్ ప్రతిపాదనలు..!
మాజీ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్- మేఘా కృష్ణారెడ్డి మదిలో పుట్టిన బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది.
సాగునీటి ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించకుండా కాంట్రాక్టర్ల కోసం నిర్మించాలనుకోవడం సరికాదని ఆలోచనపరుల వేదిక సూచించింది. కాంట్రాక్టర్ల ఒత్తిడి, లాభాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం సరికాదని, ఈఏపీ పేరుతో కాంట్రాక్టర్లే డిజైన్ చేసి, రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రజలపై అప్పుల భారం మోపడాన్ని తప్పు పట్టారు. జగన్-కేసీఆర్-మేఘా కృష్ణా రెడ్డి మదిలో పుట్టిన బనకచర్లపై చంద్రబాబు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వక్తలు ప్రశ్నించారు.
మినిట్స్ బయటపెట్టండి…
ఏపీలో పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా నది మీదుగా బనకచర్లకు తరలించాలనే ప్రతిపాదన తక్షణం ఉపసంహరించుకోవాలని సాగునీటి నిపుణులు డిమాండ్ చేశారు. రాయలసీమకు నీరుపేరుతో ప్రజల్నిమభ్య పెడుతున్నారని, దాని వల్ల నికర జలాల్లో వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సాగునీటి నిపుణులు లక్ష్మీ నారాయణ, అక్కినేని భవానీ ప్రసాద్, పాపారావు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సంబంధించిన అన్ని మినిట్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రయోజనాలకు నష్టం….
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాల మధ్య అంబికా దర్బార్ బత్తిలా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల్ని బలి చేస్తున్నారని ఆరోపించారు.
బనకచర్ల ప్రాజెక్టును కేసీఆర్-జగన్ ప్రతిపాదిస్తే ఇప్పుడు దానిని అడ్డుగా పెట్టుకుని నికర జలాల్లో ఎక్కువ వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందని, గోదావరిలో నికర జలాల లెక్క తేలకుండా ఎవరి ప్రయోజనాల కోసం బనచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం తెరపైకి తెచ్చిన ప్రాజెక్టు అని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ది చేకూర్చి, రాష్ట్రానికి గుదిబండగా మారడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు…!
పట్టి సీమ ప్రాజెక్టు విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి రూ.82వేల కోట్ల బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. బనకచర్ల జగన్ మానస పుత్రికేనని, అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలను అనుసంధానించే శక్తి మేఘా ఇంజనీరింగ్‌కే ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో లాభనష్టాలపై ప్రజల్లో చర్చ జరగాల్సి ఉందన్నారు.
లక్ష కోట్ల రూపాయల లిఫ్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేస్తున్నాయి అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలని సాగు నీటి నిపుణుడు లక్ష్మీనారాయణ సూచించారు.బనకచర్ల సముద్రంలో వృధాగా కలిసే జలాల మళ్లింపు వ్యవహారం కాదని ఆంధ్రప్రదేశ్ పాలిట గుది బండ అవుతుందన్నారు.
ఏపీ వాటా జలాలు కోల్పోయే ప్రమాదం..
ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల 200 టిఎంసీల నీటి హక్కును ఏపీ కోల్పోవాల్సి వస్తుందని, రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా జలలాల్లో ఉన్న హక్కులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రాయలసీమకు కొత్తగా ఎలాంటి ఆయక్టటు రాదని, ఎకరానికి ఏడాదికి నిర్వహణ వ్యయం రూ.50వేల ఖర్చువుతుందని ఈ డబ్బంతా తిరిగి ప్రజలే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. లిఫ్ట్‌కు అయ్యే విద్యుత్, నిర్వహణ భారాన్ని ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని ఇలాంటి మోసపూరిత ప్రాజెక్టులు నమ్మొద్దని, సీమలో పెండింగ్ ప్రాజెక్టులు రూ.20వేల కోట్లతో పూర్తయితే నీటి కష్టాలు ఉండవన్నారు.
విజయవాడ నగరానికి ముంపు ముప్పు…
ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో ప్రజలు తరతరాలు తీర్చాల్సిన అప్పుగా మారుతుందన్నారు. పట్టిసీమ కాల్వను పెద్దది చేసి 38వేల క్యూసెక్కుల నీరు పంపినా, సమాంతర కాల్వతో 23వేల క్యూసెక్కులు పంపినా విజయవాడకు ముంపు తప్పదని హెచ్చరించారు. కృష్ణా నదిలో వరద ఉంటే పోలవరం నుంచి వచ్చే నీరు నగరాన్ని ముంచెత్తుతుందని హెచ్చరించారు.
పోలవరం – పెన్నా అనుసంధానం సులువే…
పోలవరం – పెన్నా బేసిన్ అనుసంధానానికి పరిమితం అయితే బొల్లాపల్లి నంచి సోమశిలకు నీరు గ్రావిటీ ద్వారా అందించ వచ్చని, మధ్యలో నూజివీడు మీదుగా సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని సూచించారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి వాగులు, పెన్నా ద్వారా సోమశిలకు వదలడంలో కరెంటు, ఖర్చు దండగ అని, ఏపీకి అవసరం లేని ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని, ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ జలాల్లో వాటా కోల్పోయే ప్రమాదం..
బనకచర్ల ప్రాజెక్టును సాకుగా చూపి తెలంగాణ పార్టీలు, ప్రభుత్వం, విశ్రాంత ఇంజనీర్లు చేస్తున్న వాదనలు సరికాదని, బనకచర్ల వల్ల ఏపీకే నష్టం వాటిల్లుతుందని వివరించారు. పోలవరం నదీ గర్భం వద్ద వెయ్యి కోట్లతో మేఘా సంస్థ నిర్మించిన లిఫ్ట్ నిరుపయోగమైందని, దానిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
పోలవరం కుడి కాల్వ నీటిని మళ్లించాల్సి వస్తే, ప్రస్తుత కాల్వకు సమాంతర కాల్వ ప్రతిపాదన ద్వారా కాకుండా సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నూజివీడు వైపు చివరి ఆయకట్టు భూములకు కూడా నీళ్లు అందేలా అలైన్మెంట్ ఉండాలని, ఇంకో కాల్వ తవ్వితే వరదలు వస్తె విజయవాడకు మళ్ళీమళ్ళీ ముంపు వెంటాడుతుంది అనిహేచరించారు.
గోదావరి జలాలు తరలింపు వల్ల కృష్ణా జలాల్లో హక్కులు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే పట్టిసీమలో తీసుకుంటున్న 80 TMCల గోదావరి నీటికి బదులుగా కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు వాటా తీసుకుంటున్నాయని, బనకచర్ల కోసం మళ్లీ నీటిని మళ్ళిస్తే కృష్ణా జలాల్లో తగ్గిపోతాయని హెచ్చరించారు.
నదీ జలాల లభ్యత లెక్కలు తేల్చండి…
గోదావరి వరద జలాల ద్వారా చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయని, కృష్ణాలో సమయానికి నీళ్లు రావడం లేదని, ఎగువున ప్రాజెక్టులు కట్టేసుకుంటూ నీటి లభ్యత లేదని మాట్లాడుతున్నారని, రాష్ట్ర దీర్ఘ కాలిక ప్రయోజనాలు కాపాడాలని ఆలోచనా పరుల వేదిక డిమాండ్ చేసింది. స్వాతంత్య్రం తర్వాత ఇచ్చి పుచ్చుకునే దోరణిలో ప్రాజెక్టు లు నిర్మాణం జరిగిందని, ఇప్పుడు ఎగువ ప్రాజెక్టులతో చివరి ఆయకట్టుకు నీరు వచ్చే పరిస్థితులు లేవన్నారు. గోదావరి లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అని కేసీఆర్ చెప్పారని, జగన్, కేసీఆర్ చేసిన స్కీమ్ అడ్డుగా పెట్టుకుని
కృష్ణాలో 500 టిఎంసిల వాటా ఇవ్వమని రేవంత్ అడుగుతున్నారని,గోదావరిలో నికర జలాలు ఉన్నాయని చంద్రబాబు, రేవంత్ నిర్ధారణ చేయాల్సి ఉందన్నారుబనకచర్ల పేరుతో ప్రజల్ని వంచిస్తున్నారని,పోలవరం నుంచి వరద నీటిని మళ్లింపు చేయొచ్చు అని, ఎత్తిపోతల అవసరం లేదని, గ్రావిటీ మీద నీటిని మళ్లించవచ్చని ఎత్తిపోతల కోసం ఎందుకు ఆరాట పడుతున్నారని సాగునీటి నిపుణులు ప్రశ్నించారు.
రూ.82వేల కోట్లతో 4వేల మెగా వాట్ల విద్యుత్ వినియోగంతో 23వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తాం అని చెప్పడం సరి కాదని, దీనిపై ముఖ్యమంత్రి తక్షణం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలు తెలుసుకోవాలని, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని మినిట్స్ పత్రాలను బయటపెట్టాలని ఆలోచన పరుల వేదిక డిమాండ్ చేసింది.
సంబంధిత కథనం
టాపిక్