





Best Web Hosting Provider In India 2024

తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం రెండు ఓటీటీల మధ్య వార్.. కథను కాపీ కొట్టారన్న ఆరోపణలు.. స్ట్రీమింగ్ అవుతుందా?
మరో రెండు రోజుల్లో జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ కథ కాపీ అంటూ మరో ఓటీటీలో ఒరిజినల్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న మేకర్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఈ శుక్రవారం (జూన్ 27) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజైంది. అయితే రిలీజ్ కు రెండు రోజుల ముందు ఈ సిరీస్ కథ కాపీ అన్న ఆరోపణలు రావడం విశేషం. ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం మేకర్స్ ఈ ఆరోపణలు చేస్తున్నారు.
అది మా కథే..
జీ5 ఓటీటీలోకి రాబోతున్న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే వెబ్ సిరీస్ ఓ భిన్నమైన కథతో వస్తోంది. పెళ్లి రోజే పెళ్లికూతుళ్లు కన్నుమూయడం అనే మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఈటీవీ విన్ ఓటీటీ రూపొందిస్తున్న కానిస్టేబుల్ కనకం సిరీస్ స్టోరీ కూడా ఇదే అని, దీనినే వాళ్లు కాపీ కొట్టారంటూ ఆ సినిమా మేకర్స్ బుధవారం (జూన్ 25) ఆరోపించారు. ప్రెస్ మీట్ లో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడాడు. గతంలో ఓసారి ఆ ఓటీటీలోకి తన కథ చెప్పి, పూర్తి స్క్రీన్ ప్లే పంపించానని, ప్రాజెక్ట్ కొంత పూర్తయిన తర్వాత వాళ్లు వద్దనడంతో తాను ఈటీవీ విన్ ను ఆశ్రయించినట్లు చెప్పాడు.
ఈలోపే వాళ్లు మరొకరితో అదే కథతో ఈ వెబ్ సిరీస్ తీశారని, ఈ మధ్యే ట్రైలర్ చూసి తాను షాక్ తిన్నట్లు తెలిపాడు. దీంతో తాము కోర్టుకు వెళ్లామని, ప్రస్తుతం కేసు నడుస్తోందని వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని అన్నాడు. నటి వర్ష బొల్లమ్మతో కానిస్టేబుల్ కనకం మూవీని గతేడాది డిసెంబర్లో అనౌన్స్ చేశారు. ఆ కథ తనదే అని, వాళ్లు కాపీ కొట్టారనడానికి అన్ని ఆధారాలు ఉన్నట్లు చెప్పాడు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ ఏమన్నారంటే..
అటు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ కూడా మాట్లాడారు. ఈ కథను తాము 2022లోనే రిజిస్టర్ చేశామని, సీజన్ 1, సీజన్ 2 అంటూ ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ ను తాము నిర్మిస్తున్నట్లు చెప్పారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న వెబ్ సిరీస్ ఇది అని, ఇది తమ ఒరిజినల్ కథ అని స్పష్టం చేశారు. కేసు కోర్టులో ఉన్నదని, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఇస్తామని చెప్పారు.
ఓ వెబ్ సిరీస్ స్టోరీ కాపీ అంటూ రిలీజ్ కు రెండు రోజు ముందు ఆరోపణలు రావడం చాలా అరుదు. అందులోనూ తెలుగులో కంటెంట్ అందించే రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య జరుగుతున్న ఈ న్యాయపోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్ పరిస్థితేంటన్నది కూడా తేలాల్సి ఉంది. జీ5 ఓటీటీలో శుక్రవారం (జూన్ 27) నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.
సంబంధిత కథనం