





Best Web Hosting Provider In India 2024

కన్నప్ప ఫస్ట్ రివ్యూ.. ఈ సినిమా ఓ అద్భుతం.. క్లైమ్యాక్స్ గూస్‌బంప్సే.. చివరి 40 నిమిషాలు మరో లెవెల్ అంటూ కామెంట్స్
కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి. ఈ సినిమాను బుధవారం (జూన్ 25) ముంబైలో కొందరు మీడియా సభ్యుల కోసం ప్రదర్శించారు. చాలా వరకు మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. చివరి 40 నిమిషాలు అయితే అద్భుతమని కామెంట్స్ వస్తున్నాయి.
విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘కన్నప్ప’ మూవీ రేపే అంటే జూన్ 27న విడుదల కాబోతోంది. శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా రూపొందిన ఈ పౌరాణిక ఫాంటసీ థ్రిల్లర్‌ను ఇప్పటికే కొందరు మీడియా సభ్యులకు చూపించారు. అక్కడి నుంచి పలువురు ఇచ్చిన రివ్యూలు చూస్తే.. ఈ మూవీ థియేటర్లలో ఓ అద్భుతమైన అనుభూతిని పంచనున్నట్లు తెలుస్తోంది.
‘కన్నప్ప’ ఫస్ట్ రివ్యూలు ఇలా..
కన్నప్ప మూవీపై ఫస్ట్ రివ్యూలు బుధవారం (జూన్ 25) రాత్రి నుంచే ఎక్స్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ కూడా తన రివ్యూ ఇచ్చాడు. “చివరి 30 నిమిషాలు నా మనసు నుండి వెళ్లడం లేదు. ఇలాంటి తీవ్రమైన అనుభూతి నాకు కాంతార క్లైమాక్స్ సమయంలోనే కలిగింది. ప్రేక్షకులు ముఖ్యంగా శివ భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేదిగా, భావోద్వేగభరితంగా, గూస్బంప్స్ తెప్పించేదిగా ఉంది” అని సుమిత్ ట్వీట్ చేశాడు.
అతడు అంతటితో ఆగలేదు. ఈ మూవీలోని బలహీనతలను కూడా చెప్పాడు. “మొత్తంగా, ‘కన్నప్ప’ ఒక మంచి సినిమా. అయితే నెమ్మదిగా సాగే కథనం, నిర్మాణ విలువలు బలహీనతలుగా చెప్పొచ్చు. కానీ, విష్ణు మంచు చిరస్మరణీయమైన నటనతో పాటు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ (శివుడి పాత్రలో), ప్రభాస్ (రుద్రుడి పాత్రలో) నటించిన చివరి 40 నిమిషాలు మాత్రం తప్పకుండా చూడదగ్గవి” అని సుమిత్ అన్నాడు.
శివ భక్తుల కోసం తీసిన సినిమా
ఇక కన్నప్ప మూవీపై సినీ విశ్లేషకుడు రోహిత్ జైస్వాల్ కూడా తన రివ్యూ ఇచ్చాడు. “కన్నప్ప చివరి 40 నిమిషాలు అద్భుతం. నేను ఇంతకుముందెన్నడూ ఇలాంటిది చూడలేదు. ఇది శివ భక్తుల కోసం, శివలీలలను నమ్మేవారి కోసం, గర్వించదగిన సనాతనుల కోసం తీసిన సినిమా” అని ట్వీట్ చేశాడు.
ఇక మాటల రచయిత కోన వెంకట్ కూడా సినిమాను ప్రశంసించాడు. “కన్నప్ప సినిమా చూసే అవకాశం నాకు కూడా లభించింది. నిజంగా సినిమాలోని కంటెంట్ నన్ను బాగా ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్‌లో చాలా అద్భుతమైన క్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి అరగంట నిజంగా ఆకర్షణీయంగా, మంత్రముగ్ధులను చేసేలా ఉంది. ప్రభాస్ సినిమాపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపారు.
చివరి 20 నిమిషాల్లో మంచు విష్ణు నటన గురించి ప్రతి ప్రేక్షకుడూ మాట్లాడుకుంటారు. మోహన్ బాబు గారి నటన గురించి కూడా చాలా ఏళ్ల పాటు మాట్లాడుకుంటారు. ఈ కష్ట సమయాల్లో కన్నప్ప బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి పరిశ్రమకు సహాయపడుతుందని నేను నిజంగా ఆశిస్తున్నాను” అని అన్నాడు.
ఇంతకుముందు, కన్నప్ప నిర్మాతలు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సినిమా విడుదలయ్యే ముందు సినిమాకు వ్యతిరేకంగా నకిలీ వార్తలు, ప్రతికూల సమీక్షలు సృష్టించే ట్రోలర్లను హెచ్చరించారు.
సంబంధిత కథనం