రెండ్రోజుల ఫేస్‌బుక్ పరిచయం.. మహిళను చంపి పొలంలో పాతిపెట్టిన యువకుడు

Best Web Hosting Provider In India 2024


రెండ్రోజుల ఫేస్‌బుక్ పరిచయం.. మహిళను చంపి పొలంలో పాతిపెట్టిన యువకుడు

Anand Sai HT Telugu

సోషల్ మీడియాలో పరిచయాలు ఇటీవలి కాలంలో ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో రెండు రోజుల ఫేస్‌బుక్ పరిచయం మహిళ ప్రాణాలను తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం

మధ్య కాలంలో చిన్న కారణాలకే మనుషులను చంపుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను, కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. వీటికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం అవుతుంది. కొందరు సోషల్ మీడియాలో పరిచయమైన కొంతకాలానికే పీకల్లోతు మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో రెండు రోజుల ఫేస్‌బుక్ పరిచయం మహిళను చంపేసింది.

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళను 28 ఏళ్ల యువకుడు హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. నిందితుడు పునీత్ గౌడను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మృతురాలిని హసన్ జిల్లాకు చెందిన ప్రీతి సుందరేష్‌(39)గా గుర్తించారు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

నిందితుడు పునీత్ గౌడ మాండ్య జిల్లాకు చెందినవాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం నిరుద్యోగి. ఫేస్‌బుక్ ద్వారా ప్రీతి పరిచయమైంది. కేవలం రెండు రోజులు మాట్లాడుకున్న తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫేస్‌బుక్ చాటింగ్‌లో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఉన్నట్టుగా తేలిందని పోలీసులు తెలిపారు. శనివారం ప్రీతి తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా పునీత్‌తో కలిసి కారులో వెళ్లింది. హసన్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో వీరిద్దరూ ఏకాంత క్షణాలు గడిపారు. ఆ తర్వాత ఏదో విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వాగ్వాదంలో పునీత్ కోపంతో ప్రీతిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

హత్య అనంతరం నిందితుడు ప్రీతి మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి మాండ్య జిల్లా కేఆర్ పేట తాలూకా కట్టఘట్ట అటవీ ప్రాంతంలోని తన పొలంలో పూడ్చిపెట్టాడు. ప్రీతి కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు శనివారం హసన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాల్ డిటైల్ రికార్డ్స్, ఫేస్బుక్ సందేశాల ద్వారా పునీత్‌ను చేరుకున్నారు.

శారీరక సంబంధం కొనసాగించేందుకు ప్రీతి తనకు డబ్బు ఆఫర్ చేసిందని, అయితే నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది చివరకు హత్యగా మారిందని విచారణలో నిందితుడు చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని బుధవారం మాండ్య పోలీసులు మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link