




Best Web Hosting Provider In India 2024

వర్షాకాలంలో ముక్కు దిబ్బడా? ఉపశమనం కోసం డాక్టర్ చెప్పిన 5 చిట్కాలు
మీ ముక్కు దిబ్బడను కంట్రోల్ చేసుకోవాలంటే, దానికి కారణమేంటో, దాన్ని సమర్థవంతంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. డాక్టర్ అతుల్ మిట్టల్ ముక్కు దిబ్బడను పోగొట్టుకోవడానికి 5 సులభమైన, సమర్థవంతమైన మార్గాలను హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.
వర్షాకాలం రాగానే, కిటికీ పక్కన కూర్చుని చల్లగాలిని ఆస్వాదించడం, వేడివేడి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, లేదంటే వర్షంలో తడుస్తూ ఆడుకోవడం… ఇవన్నీ ఎంతో సరదాగా ఉంటాయి కదా. కానీ, ఈ ఆనందాన్ని ఒక్క ముక్కు దిబ్బడ క్షణాల్లో దూరం చేస్తుంది. అసలు ఊపిరి ఆడక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మీ ముక్కు దిబ్బడను కంట్రోల్ చేసుకోవాలంటే దానికి కారణమేంటో, దాన్ని సమర్థవంతంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి ప్రిన్సిపల్ డైరెక్టర్, హెడ్ అయిన డాక్టర్ అతుల్ మిట్టల్ ముక్కు దిబ్బడను పోగొట్టుకోవడానికి 5 ఉత్తమ మార్గాలను హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.
“ముక్కు మూసుకుపోవడం, దిబ్బడగా అనిపించడం.. ఇవన్నీ మన రోజువారీ పనులకు అడ్డు తగులుతాయి. నిద్ర పట్టదు. వాసన సరిగా తెలియదు. నీరసంగా ఉంటుంది. నిజానికి, దీన్ని కేవలం కాలంతో వచ్చే ఇబ్బందిగా చూడొద్దు. పర్యావరణంలోని మార్పులు, మన శరీర సున్నితత్వం, రోజువారీ అలవాట్లు – ఇవన్నీ కలిపి ముక్కు దిబ్బడను ఏడాది పొడవునా ఒక సమస్యగా మార్చగలవు. మంచి ముక్కు ఆరోగ్యం కోసం, ఈ ప్రభావాలను అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వెంటనే ఉపశమనం పొందడానికి, దీర్ఘకాలంలో కూడా సమస్య రాకుండా చూసుకోవడానికి ఒక సంపూర్ణమైన పద్ధతిని పాటించాలి” అని చెప్పారు.
ముక్కు దిబ్బడకు గల కారణాలు, చికిత్స విధానాలు, అలాగే డాక్టర్‌ను ఎప్పుడు కలవాలో తెలిపే పూర్తి వివరాలతో కూడిన మార్గదర్శకాన్ని డాక్టర్ అతుల్ మిట్టల్ మాతో పంచుకున్నారు.
ముక్కు దిబ్బడకు నాలుగు ప్రధాన కారణాలు:
వైరల్ ఇన్ఫెక్షన్లు: జలుబు, ఫ్లూ వంటి వైరల్ జబ్బులు ముక్కు దిబ్బడకు ప్రధాన కారణం. ఇవి ముక్కు లోపల వాపును, శ్లేష్మం (కొంచెం చిక్కటి ద్రవం) ఉత్పత్తిని పెంచుతాయి.
అలెర్జీలు: కాలంతో సంబంధం లేకుండా లేదా కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు (పుప్పొడి, దుమ్ము రేణువులు, పెంపుడు జంతువుల నుండి రాలే చర్మ కణాలు) ముక్కులో వాపును, దిబ్బడను కలిగిస్తాయి.
సైనసిటిస్: ముక్కులోని సైనస్‌లలో వాపు రావడాన్నే సైనసైటిస్ అంటారు. ఇది జలుబు లేదా అలెర్జీలు ఎక్కువైన తర్వాత తరచుగా వస్తూ ఉంటుంది.
పర్యావరణంలోని కారకాలు: పొగ, కాలుష్యం, లేదా ఘాటైన వాసనలు ముక్కు లోపలి భాగాలను చికాకు పెట్టి, వాపును, ముక్కు దిబ్బడను కలిగించవచ్చు.
5 ప్రభావవంతమైన చిట్కాలు:
నాసల్ డీకంజెస్టెంట్లు: మెడికల్ షాపుల్లో దొరికే నాసల్ స్ప్రేలు, ముఖ్యంగా సరిపడా మోతాదులో ద్రవాన్ని అందించేవి, ముక్కు దిబ్బడను తగ్గించడానికి సులభమైన, సమర్థవంతమైన మార్గం. అయితే, వీటిని బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉపయోగించాలి.
సెలైన్ నాసల్ స్ప్రేలు: ఇవి ముక్కు లోపలి మార్గాలను సున్నితంగా తేమగా ఉంచుతాయి. చిక్కగా మారిన శ్లేష్మాన్ని పల్చబరిచి, ముక్కుకు చికాకు లేదా అలెర్జీలకు కారణమయ్యే పదార్థాలను బయటకు పంపేస్తాయి. వేగంగా, హాయిగా ఉపశమనం పొందాలంటే రోజంతా అవసరమైనప్పుడు వీటిని వాడుకోవచ్చు.
వేడి కాపడం: ముఖంపై, ముఖ్యంగా సైనస్‌లు ఉన్న నుదురు, బుగ్గల భాగాలపై వేడి కాపడం పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గి, ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది. ఈ వెచ్చదనం వల్ల శ్లేష్మం పల్చబడి, అసౌకర్యం కూడా తగ్గుతుంది.
తల ఎత్తుగా ఉంచండి: నిద్రపోయేటప్పుడు, అదనపు దిండును ఉపయోగించి తలను కొద్దిగా ఎత్తుగా పెట్టుకోవడం వల్ల ముక్కు దిబ్బడ తీవ్రత తగ్గుతుంది. ఈ చిన్నపాటి మార్పు రాత్రంతా మీకు హాయిగా శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.
నీరు పుష్కలంగా తాగండి: నీరు, ఇతర ద్రవాలు ఎక్కువగా తాగడం వల్ల శ్లేష్మం పల్చబడి, ముక్కు మార్గాలు తేమగా ఉంటాయి. ఇది ముక్కు దిబ్బడను తొలగించడానికి, మరింత స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడానికి సులభతరం చేస్తుంది. రోజుకు సుమారు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి.
వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
- మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే, లేదా 7-10 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే.
- అధిక జ్వరం, ముఖంపై విపరీతమైన నొప్పి, లేదా ఆకుపచ్చ/పసుపు రంగులో ముక్కు స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే.
- మీకు తరచుగా ముక్కు నుండి రక్తం వస్తుంటే.
(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ వ్యాసం కేవలం మీకు సమాచారం అందించడం కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.)