ఆగస్టు 15 నుంచే ‘ఉచిత బస్సు స్కీమ్’ – అదనంగా 2,045 బస్సులు..! ఏపీ సర్కార్ అంచనాలివే

Best Web Hosting Provider In India 2024

ఆగస్టు 15 నుంచే ‘ఉచిత బస్సు స్కీమ్’ – అదనంగా 2,045 బస్సులు..! ఏపీ సర్కార్ అంచనాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

మహిళలకు ఉచిత బస్సు’ పథకం అమలుపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు చేయాలని నిర్ణయించింది.

ఏపీఎస్ఆర్టీసీ

ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు.

ఇకపై అన్నీ ఈవీ బస్సులే – సీఎం చంద్రబాబు

పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలన్నారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని… ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే, ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.

ఆర్ధిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి… ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్ధత పెంచుకోవాలని చెప్పారు. బస్ కాంప్లెక్స్‌లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పరిశీలనకు సీఎం ఆదేశాలు…

‘బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలి. డీజిల్, ఈవీ, సీఎన్జీ, బ్యాటరీ స్వైపింగ్… ఇలా ఏ బస్సు కొనుగోలు, నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించండి. బ్యాటరీ, బ్యాటరీ లేకుండా, సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం, బస్సులను ఆపరేట్ చేయడం… ఇలా ఏ విధానంతో వ్యయం తగ్గుతుందనేది పరిశీలించండి” అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అదనంగా 2,045 బస్సులు అవసరం

కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి రూ.996 కోట్లు వ్యయం కానుందని భావిస్తున్నారు. అలాగే బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందిని సీఎంకు అధికారులు వివరించారు.

  • రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లు ఉంటే అందులో మహిళలు 2.62 కోట్లు ఉన్నారు. వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 43.06 కోట్లుగా ఉంది.
  • ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఇది 75.51 కోట్లకు పెరగొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తుంటారని తెలిపారు.
  • ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగొచ్చు.
  • మొత్తమ్మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుంది.

ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టే విధానం అత్యుత్తమంగా, సంతృప్తి కలిగేలా… ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

మొత్తం బస్సుల్లో 57 శాతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఇవి 67.76 కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 17 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్‌పోర్టు కింద అందిస్తోంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Free Bus SchemeAp Free Bus SchemeAndhra Pradesh NewsAp GovtChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024