




Best Web Hosting Provider In India 2024

Diabetes Reversal: కోమా అంచు నుంచి కోలుకొని.. కేవలం 2 నెలల్లో షుగర్‌ను తరిమికొట్టిన 57 ఏళ్ల మహిళ
Diabetes Reversal: టైప్ 2 డయాబెటిస్ అని తెలిసిన తర్వాత ఉషా రేచల్ థామస్ కేవలం కొద్ది వారాల్లోనే తన ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకున్నారు. త్వరగా గుర్తించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెబుతున్నారు.
2024లో ఉషా రేచల్ థామస్ ముంబైలో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కొన్ని మాటలు విన్నారు. అవి ఆమె జీవితాన్నే మార్చేశాయి. “మీరు నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు.. కానీ వైద్యపరంగా చూస్తే, మీరు ఐసీయూలో ఉండాలి.” అని ఆ డాక్టర్ ఆమెతో అన్నారు. ఒక సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్, కమ్యూనికేషన్స్ లీడర్‌గా ఎన్నో ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొన్న ఉషకు.. తన శరీరం నిశ్శబ్దంగా డయాబెటిక్ కోమా వైపు వెళ్తోందని తెలిసినప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు.
ఆమె శరీరంలో పెద్దగా ప్రమాదకరమైన సంకేతాలేవీ కనిపించలేదు. కేవలం అలసట, ఎంత నీళ్లు తాగినా తీరని దాహం, ప్రతీ భోజనం తర్వాత శరీరాన్ని ఆవరించే నీరసం. రెండు నెలల పాటు, ఆమె ఈ లక్షణాలను ఒత్తిడి లేదా వేడి కారణంగా వస్తున్నాయని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆమె బ్లడ్ షుగర్ రిపోర్ట్ మాత్రం వేరే కథ చెప్పింది. “గ్లూకోమీటర్‌లో 500, కచ్చితంగా చెప్పాలంటే 538 అని చూపించింది — ఇది మామూలుగా ఉండాల్సిన దానికంటే ఐదు రెట్లు ఎక్కువ” అని 57 ఏళ్ల ఆమె HT హెల్త్ షాట్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“నేను అలసిపోయాను అంతే” అనే ఆమె భావన ఆ రోజు పూర్తిగా మారిపోయింది. చివరికి, అది వైద్యపరమైన మార్పునకు దారితీసింది. ఆ తర్వాత ఉషా తనను తాను గౌరవించుకోవడం, తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, సెల్ఫ్ కేర్ వైపు స్పృహతో అడుగులు వేయడం మొదలుపెట్టారు.
తేలిగ్గా తీసుకున్న డయాబెటిస్ సంకేతాలు
తను మామూలు కంటే ఎక్కువగా అలసిపోతున్నానని, ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత మరింత నీరసంగా ఉంటుందని ఉషా చెప్పారు. ఉదయం టిఫిన్ చేయగానే విపరీతమైన నిద్ర ఆవరించడం, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అదే జరగడం సాధారణమైపోయింది. “ముంబైలోని భరించలేని వేడి లేదా మా కంపెనీ విలీనం వల్ల వచ్చిన ఒత్తిడి అనుకున్నాను” అని ఆమె అన్నారు.
విపరీతమైన దాహాన్ని డీహైడ్రేషన్ అని, తరచుగా మూత్ర విసర్జనను ఎక్కువ నీళ్లు తాగడం వల్ల అని అనుకున్నారు. కానీ ఆమె గమనించని విషయం ఏమిటంటే, చాలామందిలాగే ఆమె కూడా శరీరం ఇచ్చే సూక్ష్మమైన సహాయ సంకేతాలను పట్టించుకోలేదు. ఆమె ప్రమాదంలో ఉందని ఇతరులు గమనించడానికి కూడా ఎవరూ లేరు.
“సంవత్సరం కిందట నాన్న చనిపోవడం, అమ్మ ఒంటరితనాన్ని, ఆమె బాధను చూసుకోవడం, నా చిన్న కొడుకు టొరంటోలో భార్యతో స్థిరపడటానికి వెళ్లిన తర్వాత వచ్చిన ఒంటరితనం (empty nest syndrome), మా కంపెనీ విలీనం టైమ్‌లో ఇంటి నుంచే పని చేయడం.. ఇవన్నీ కలిసి ఒత్తిడిని, ఒంటరితనాన్ని బాగా పెంచాయి” అని ఆమె వివరించారు.
చివరికి ఉష డాక్టర్ బి.ఎస్. శెట్టిని కలిశారు. ఆయన వెంటనే విషయాలను పసిగట్టారు. రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోమని సూచించారు. ఫలితం 538 అని వచ్చినప్పుడు, ఏ రోగి కూడా వినకూడని మాటలు విన్నారు. “మీరు ఐసీయూలో ఉండాలి.” అని ఆ డాక్టర్ చెప్పారు.
డయాబెటిక్ కోమాకు దగ్గరగా ఉంది..
“ఆ మాటలు దశాబ్దాలుగా నేను నాకు చెప్పుకుంటున్న కథలను పూర్తిగా ధ్వంసం చేశాయి. నేను ఓటమి లేనిదానిననే నా భ్రమ ఆ ల్యాబ్ రూమ్‌లో పటాపంచలైంది. నాకు టైప్ 2 డయాబెటిస్ ఉంది. అది కూడా సాధారణమైనది కాదు. నా జీవితాన్ని ముగించగలిగే డయాబెటిక్ సంక్షోభం అంచున నిలబడి ఉన్నాను” అని ఉషా ఆ రోజును గుర్తుచేసుకుంటూ అన్నారు.
వెనక్కి తిరిగి చూస్తే, ఉషా ఇప్పుడు తన శరీరం చాలా సంవత్సరాలుగా పంపుతున్న ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించగలుగుతున్నారు. ఆమె అప్పట్లో నిర్లక్ష్యం చేసినవి ఇవే.
- మామూలు రక్త పరీక్షల ఫలితాలు సాంకేతికంగా “నార్మల్ రేంజ్” ఉన్నప్పటికీ, ప్రమాదకరమైన దిశగా మారుతున్న చిన్న చిన్న లోపాలు.
- ఆకస్మిక బెణుకుల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం.
- తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతర అలసట.
- శరీర కూర్పులో వివరించలేని మార్పులు, వాటిని వయస్సుతో సంబంధం ఉన్నవిగా అనుకోవడం తప్ప జీవక్రియ పనిచేయకపోవడం వల్ల అని గుర్తించలేకపోవడం.
- ఆమె శక్తి తగ్గుతున్న కొద్దీ తెలియకుండానే చేసుకున్న అలవాటు మార్పులు. మెట్ల బదులు లిఫ్టు వాడటం. నడిచి వెళ్ళగలిగే తక్కువ దూరాలకు కూడా కారు వాడటం.
డయాబెటిస్ రివర్సల్ వైపు ప్రయాణం
డయాబెటిక్ కోమా అంచున ఉన్నారని తెలిసిన ఒక వారం తర్వాత, ఉష ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ధీరజ్ కపూర్ ముందు కూర్చున్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా, ఆయన ఆమెతో “బరువు పెరగడం మొదలైన 11 సంవత్సరాల క్రితమే మీరు ఎండోక్రినాలజిస్ట్‌ను కలిసి ఉండాలి. ఇప్పుడు బాధ్యత మీదే. మీరు చాలా కష్టపడాలి. కానీ శుభవార్త ఏమిటంటే మీ ఇతర కీలకమైన సంకేతాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే మీరు కోలుకోగలరు.” అని చెప్పారు.
ఆ క్షణంలో, ఆమెకు ఒక ఆప్షన్ ఉందని అనిపించింది. “నేను మరింత కుంగిపోవాలా, లేదా నేను కోలుకోవడం ప్రారంభించాలా..” అని అనుకున్న ఉషా కోలుకోవడాన్నే ఎంచుకున్నారు. 60 రోజుల్లో టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టారు.
కేవలం 2 నెలల క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మార్పులతో, ఉషా తన రక్తంలో చక్కెర స్థాయిలను డయాబెటిక్ లేని పరిధిలోకి తీసుకువచ్చారు. గత పది నెలలుగా, ఆమె ఎటువంటి తీవ్రమైన మందులు లేకుండా, లేదా ఆహార నియంత్రణ లేకుండా వాటిని నియంత్రణలో ఉంచుకుంటున్నారు.
అసలు ఎలా సాధించారు?
3 ప్రాథమిక అంశాలపై ఇది ఆధారపడి ఉందని మాజీ జర్నలిస్ట్, IIM-A పూర్వ విద్యార్థిని అయిన ఉష వివరించారు. 1. మొదట్లో వైద్య సహాయం, 2. ఆలోచనలో మార్పు 3. పద్ధతి ప్రకారం జీవనశైలిని తిరిగి నిర్మించుకోవడం.
“నేను ఇప్పుడు దాదాపు మందులు లేకుండా ఉన్నప్పటికీ, నా పరిస్థితిని స్థిరీకరించడానికి అతి తక్కువ మోతాదు టాబ్లెట్‌తో ప్రారంభించాను. ఈ మద్దతు నా జీవనశైలి మార్పులు పనిచేయడానికి వీలు కల్పించింది” అని ఆమె అన్నారు.
కార్యక్రమంలో మార్పులు:
ఆహారం తీసుకునే సమయాన్ని మార్చుకున్నారు. రోజూ ఆలస్యంగా రాత్రి భోజనాలు లేదా అర్ధరాత్రి నిద్రపోవడం లేదు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 7:30-8:00 గంటలలోపు భోజనం
- హార్మోన్ల నియంత్రణకు వీలుగా ఇవ్వడానికి రాత్రి 10:30-11:00 గంటలలోపు నిద్ర
- పని డిమాండ్లకు ముందు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఉదయం దినచర్యలు
- ఉద్దేశపూర్వకంగా శారీరక కదలికను పెంచుకున్నారు
- ప్రతీ భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక
- పళ్లు తోముకునేటప్పుడు లేదా నీళ్లు వేడి అయ్యే వరకు వేచి ఉన్నప్పుడు సాధారణ సోలియస్ పుష్‌అప్‌లు. అంటే మీరు కుర్చీలో కూర్చొని కాళ్లు నేలకు అనించి మడమలు పైకిలేపి నెమ్మదిగా మళ్లీ కింద ఆనించడం. గ్లూకోజును ఎక్కువగా నిల్వ చేసుకునే పిక్క కండరాలు ఈ వ్యాయామం వల్ల ఆరోగ్యంగా మారి చక్కెరస్థాయిలను తగ్గిస్తాయి.
- ఇన్‌స్ట్రక్టర్లు సౌరభ్ బోత్రా, త్రిషాలా బోత్రా ద్వారా రోజూ యోగా, డ్యాన్స్ సెషన్‌లు చేసేవారు. దీని వల్ల ఉష శక్తిని, ఆనందాన్ని తిరిగి పొందగలుగుతున్నారు.
- ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల నడక.
ఆహారపు అలవాట్లలో మార్పులు:
ఆమె ప్రధానంగా చేసిన మార్పు ఏంటంటే ఏం తిన్నామన్నది కాదు.. ఎలా తింటున్నామనేదే ఆ ప్రధాన మార్పు.
ముందుగా కూరగాయలు, ఆ తర్వాత మిగతావి. “ఈ సాధారణ మార్పు నా గ్లూకోజ్ ప్రతిస్పందనపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నేను ఆహారాన్ని మార్చలేదు. ప్రాధాన్యతలు మార్చాను” అని ఆమె వివరించారు.
మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకున్నారు. రుచులు, సంతృప్తి సంకేతాలను గమనించడానికి నెమ్మదిగా తినడం మొదలు పెట్టారు. “నేను ఇప్పటికీ చాక్లెట్ పండ్లు తింటాను. నేను కేవలం వ్యాయామం, జవాబుదారీతనంతో వాటిని బ్యాలెన్స్ చేస్తాను..’ అని వివరించారు. “చాక్లెట్‌కు, మామిడిపండ్లకు ‘అవును’ అన్నాను. కానీ సమయం, పరిమాణంపై కచ్చితమైన అవగాహన ఉండాలి.” అని వివరించారు.
డయాబెటిస్ రివర్సల్‌కు సానుకూల సంకేతాలు
డయాబెటిస్ నిర్వహణ కోసం ఈ ప్రాథమిక జీవనశైలి మార్పులతో కూడా, కేవలం 2 వారాల్లో ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు 538 నుండి 180కి, ఆ తర్వాత 112కి, తర్వాత 98కి తగ్గాయని ఉషా గమనించారు. “2 నెలల్లో, నేను టైప్ 2 డయాబెటిస్‌ను రివర్స్ చేశాను. 10 నెలలుగా నేను డయాబెటిక్ కాని పరిధిలోనే ఉన్నాను. నేను క్రమంగా 20 కిలోల బరువు తగ్గాను. సన్నగా లేదా రోగగ్రస్తంగా కనిపించకుండా దృఢంగా, ఆరోగ్యంగానే ఉన్నాను..’ అని వివరించారు.
ఇద్దరు కొడుకుల తల్లిగా ఆమె “నేను స్వీయ నిర్లక్ష్యాన్ని కూల్చివేసి, నా శరీరంతో నా సంబంధాన్ని తిరిగి నిర్మించుకున్నాను. ప్రమాదకర స్థాయి ఆరోగ్య సంక్షోభం కొన్ని రోజులుగా లేదా నెలలుగా చేసిన తప్పిదాల ఫలితం కాదని నేను గ్రహించాను. ఇది 36 సంవత్సరాల స్వీయ పరిత్యాగానికి పరాకాష్ట. చాలా మంది మహిళలలాగే నా కుటుంబాన్ని చూసుకోవడం, నా కెరీర్‌లో రాణించడం అంటే నన్ను నేను బాగానే చూసుకుంటున్నానని అనుకున్నాను. నేను పనిపై దృష్టిపెట్టి రాణించగలిగాను. అయితే నా సొంత శారీరక అవసరాలకు నేను తక్కువ ప్రాధాన్యతనిచ్చానో నేను చూడలేకపోయాను.” అని వివరించారు.
కచ్చితంగా చెప్పాలంటే, ఆమె జబ్బు రాకముందే చూసుకోవడం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా జబ్బు చేసి, విషయం సీరియస్ అయ్యాకే డాక్టర్ దగ్గరకు వెళ్లడం అవసరం అనుకునేవారు. ఒత్తిడి, మెనోపాజ్ వల్లనే 30 కిలోల బరువు పెరిగానని, అది సాధారణమేనని అనుకున్నారు. ఆమె పని చేసిన 24 గంటల మీడియా, వినోద రంగంలో అర్థరాత్రి భోజనాలు, నిద్ర లేని రాత్రులు మామూలైపోయాయి. ఇక తినే అలవాట్లంటారా… ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ భోజనాలు, అర్ధరాత్రుళ్లు పట్టీపట్టనట్టుగా తినడం ఇవే. రోజూ 14-16 గంటలు స్క్రీన్ల ముందు కూర్చుని పని చేయడం, డెడ్‌లైన్లు పూర్తి చేయడం వల్ల శారీరక శ్రమ దాదాపు లేకుండా పోయింది. ఇదంతా జరుగుతుంటే, ఆమె తన శరీరం చెప్పే మాటలను అసలు వినడమే మానేశారు.
సంక్షోభం మిమ్మల్ని తాకే వరకు వేచి ఉండకండి
“ఈ లోతైన వ్యక్తిగత ప్రయాణాన్ని పంచుకోవడంలో నా ఉద్దేశ్యం ఇతరులకు ఉన్న అవకాశాలను హైలైట్ చేయడమే. మీరు నేను ఉన్న చోటే ఉండవచ్చు. సరైన మార్గదర్శకత్వం, నిబద్ధతతో మార్పు సాధ్యమని మీరు తెలుసుకోవాలి. సంక్షోభం మిమ్మల్ని బలవంతం చేయడానికి ముందే మీ ఆరోగ్య ప్రయాణం ప్రారంభం కావాలి” అని ఆమె ముగించారు.
(ఈ ఆర్టికల్ ఒక వ్యక్తి టైప్ 2 డయాబెటిస్ అనుభవం ఆధారంగా రూపొందింది. మీ వ్యక్తిగత అవసరాలకు సరిపోయే ఆహారం లేదా జీవనశైలి మార్పులు చేయడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.)