





Best Web Hosting Provider In India 2024

టీమిండియా స్టార్ క్రికెటర్.. రూ.600 కోసం తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా.. ఎవరో తెలుసా?
టీమిండియాతోపాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కు స్టార్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి రూ.600 కోసం ఓ తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేశాడని మీకు తెలుసా? ఆ వివరాలేంటో చూడండి.
ఇండియాలో క్రికెట్, సినిమాలు రెండింటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానం కాదు.. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చి అని కూడా అనొచ్చు. అందుకే, అప్పుడప్పుడూ క్రికెట్ ఆటగాళ్లు నటన వైపు మొగ్గు చూపడం సహజమే. సౌరవ్ గంగూలీ, శ్రీశాంత్ లాంటి వాళ్లు చిన్నా చితకా రోల్స్ చేశారు.
అది అభిరుచి కావచ్చు, అవసరం కావచ్చు. అలాంటి ఒక ఆసక్తికరమైన కథే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఒక స్టార్ స్పిన్ బౌలర్‌ది. అతడు ఒకప్పుడు తమిళ సినిమాలో కేవలం రూ.600కి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడంటే నమ్మగలరా?
జీవా సినిమాలో వరుణ్ చక్రవర్తి
టీమిండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి తన క్రికెట్, సినిమా జర్నీ గురించి టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్‌తో యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నాడు. ఇప్పుడు 33 ఏళ్ల వరుణ్, తనకు 26 ఏళ్ల వయసులో క్రికెట్‌పై నిజమైన ఆసక్తి ఏర్పడిందని చెప్పాడు. అంతకు ముందు అతడు గిటారిస్ట్‌గా, ఆర్కిటెక్ట్‌గా, సినీ నిర్మాతగా, చివరకు నటుడిగా కూడా ప్రయత్నాలు చేశాడట.
కాలేజీ రోజుల్లో వరుణ్ ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో పనిచేశాడు. అక్కడ నెలకు రూ.14,000 సంపాదించేవాడు. అతడు ఆ పని వదిలేసే సమయానికి రూ.18,000 అందుకునేవాడట. ఇక 24 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా దర్శకుడు సుశీంద్రన్‌తో కలిసి 2014లో వచ్చిన తమిళ మూవీ ‘జీవా’లో పని చేస్తున్నప్పుడు, అతడు తెరపై ఒక క్రికెటర్‌గా కనిపించే అవకాశం వచ్చింది.
కేవలం రూ.600 కోసం..
ఆ సినిమాలో నటించిన అనుభవం గురించి వరుణ్ పంచుకున్నాడు. “రోజుకు రూ.600కి నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా సంతకం చేశాను” అని వరుణ్ అన్నాడు. ఇప్పుడు ఒక క్రికెటర్‌గా అతని రోజువారీ సంపాదన ఎంత అని అశ్విన్ అడిగినప్పుడు.. వరుణ్ నవ్వుతూ “ఇప్పుడు అది 300 డాలర్లు (రూ.25,000)” అని బదులిచ్చాడు. టెన్నిస్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా తనకు తెరపై క్రికెట్ ఆడే అవకాశం వచ్చిందని వరుణ్ చెప్పాడు. “సిక్స్ కొడితే రూ.300, యార్కర్ వేస్తే రూ.200 ఇస్తామని వాళ్లు ప్రకటించేవారు” అని అతడు గుర్తు చేసుకున్నాడు.
ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన వరుణ్, ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌కు రూ.12 కోట్లు సంపాదిస్తున్న స్టార్ క్రికెటర్ అని ఒక రిపోర్ట్ చెబుతోంది. నిజానికి ఇది చాలామందికి తెలియని విషయమే. అతని ప్రయాణం చూస్తుంటే ఎవరికైనా స్ఫూర్తి కలగక మానదు.
వరుణ్ చక్రవర్తి గురించి..
వరుణ్ 1991లో కర్ణాటకలోని బీదర్‌లో వినోద్ చక్రవర్తి (బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఐటీఎస్ అధికారి), మాలిని (గృహిణి) దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సగం తమిళం, సగం మలయాళీ. తల్లి కన్నడిగ. వృత్తిగా క్రికెట్‌ను ఎంచుకోవడానికి అతడు ఆర్కిటెక్చర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
2018 తమిళనాడు ప్రీమియర్ లీగ్ సమయంలో వరుణ్ వెలుగులోకి వచ్చాడు. అదే సంవత్సరం, 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ప్రీతి జింటా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. 2020 ఐపీఎల్ వేలంలో, షారుఖ్ ఖాన్ కేకేఆర్ జట్టు అతన్ని దక్కించుకుంది. వరుణ్ ఐపీఎల్‌లో 8 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నాడు.
సంబంధిత కథనం