గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ : మా నీటి హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం – సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ : మా నీటి హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం – సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

గోదావరి బేసిన్ లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాతే మిగులు జలాల లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన… నది జలాల్లో తెలంగాణ వాటా కోసం అన్ని విధాలుగా పోరాడుతామన్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపిన తర్వాతే మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మిగులు, వరద జలాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగాలని స్పష్టం చేశారు.

గోదావరి – కృష్ణా బేసిన్‌లో తెలంగాణ నీటి వాటా అన్న అంశంపై పూలె ప్రజాభవన్ లో ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరయ్యారు.

జల వివాదాలపై చారిత్రక పరిణామాలు, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ఇందులో పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు, చట్టాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులు, అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వంటి అన్ని అంశాలపై సమగ్రమైన వివరాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. “ఇరు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. అలా కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించే విధానం సరైనది కాదు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపినప్పుడే జల వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది.

  • గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ శాశ్వత హక్కుల కోసం స్పష్టమైన విధానంతో ముందుకు పోతాం. నీటి కేటాయింపులు, వాటిపై హక్కులను ఎలా సాధించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఎజెండా. ముందుగా తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు చట్టబద్ధమైన నికర కేటాయింపులు జరపాలి. ఆ తర్వాత మిగులు, వరద నీటి అంశాలకు పరిష్కారం దొరుకుతుంది.
  • తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత మిగులు, వరద జలాలెన్ని ఉన్నాయన్న అంశం వస్తుంది. వాటిల్లోనూ ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరగాల్సి ఉంది. మిగులు, వరద జలాల్లోనూ నిష్పత్తి ప్రకారం తెలంగాణకు హక్కులు ఉంటాయి.
  • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటి కేటాయింపులతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు. ఒకవైపు తెలంగాణ నికర జలాలపై అభ్యంతరపెడుతూ మరోవైపు మిగులు జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది.
  • తెలంగాణ నీటి హక్కుల కోసం సమయం, సందర్భానుసారంగా సాంకేతికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తాం. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారింది.
  • ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాలపై స్పష్టమైన కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. నీటి కేటాయింపుల అనుమతులను కూడా తీసుకురాలేదు. ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు.
  • ఈ విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు జరగాలి. అప్పటికే తేలకపోతే అపెక్స్ కమిటీ ముందు చర్చించి పరిష్కరించుకోవాలి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
  • గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం సాంకేతిక అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన అంశాలను ప్రజల ముందు, న్యాయపరమైన చిక్కులను న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Banakacherla ProjectTelangana NewsTrending TelanganaCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024