




Best Web Hosting Provider In India 2024

జనంలోకి వైఎస్ జగన్…! మరోసారి పాదయాత్రకు ప్లాన్
వైసీపీ అధినేత జగన్ మళ్లీ పాదయాత్రకు వెళ్లనున్నారు. ఇదే విషయంపై తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోవు ఎన్నికలకి ముందు మళ్లీ పాదయాత్రతో ప్రజల చెంతకి వెళ్తానని చెప్పుకొచ్చారు.
వైఎస్ జగన్ మరోసారి పాత ఫార్ములాతోనే ముందుకు రానున్నారు. 2019 ఎన్నికల కంటే ముందు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రతో వైసీపీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన జగన్… ఆ ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విక్టరీ కొట్టారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీకి… 2024 ఎన్నికలు పీడకలను మిగిల్చియానే చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా…. వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచే సిద్ధమయ్యే పనిలో పడింది.
మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర…
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ బలోపేతంపై మళ్లీ ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. గత కొంతకాలంగా జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ…. దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చేది మనమే అన్న ధీమాను వారిలో నింపుతున్నారు. అయితే తాజాగా ఆయన వైసీపీ యువజన విభాగం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. మరోసారి పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు. రాబోవు ఎన్నికలకి ముందు మళ్లీ పాదయాత్రతో ప్రజల చెంతకి వెళ్తానని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి జగన్… పాదయాత్రతో జనంలోకి వెళ్లటం ఖరారైపోయింది. జగన్ ప్రకటనపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారిగా 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా ఈ యాత్రను కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీతో ఈ యాత్ర ముగిసింది. తన పాదయాత్రలో జగన్ వేలాది మందిని నేరుగా కలిశారు. ప్రజా సమస్యలు వింటూ, వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ పాదయాత్ర సాగించిన సంగతి తెలిసిందే.
ఇక యువజన విభాగం నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్….కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకం కావాలని… ప్రజాసమస్యలను ఎత్తిచూపాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలను తిప్పికొట్టేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రస్థానాన్ని జగన్ గుర్తు చేశారు.
కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలతో వైసీపీ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. 2010 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మద్దతు లభించిందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల తర్వాత 67 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో… 23 మందిని టీడీపీ లాక్కుందన్నారు. అయినప్పటికీ ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడ్డామని చెప్పుకొచ్చారు.
“వైయస్‌ఆర్‌సీపీలో యూత్ వింగ్ అనేది చాలా క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు యువతకి గొప్ప అవకాశం ఉంది” అంటూ వైఎస్ జగన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
టాపిక్