




Best Web Hosting Provider In India 2024

పాశమైలారం పేలుడు ఘటన : 40 మంది మృతి, 33 మందికి గాయాలు – ఆర్థిక సాయంపై సిగాచి కంపెనీ ప్రకటన
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై సిగాచి కంపెనీ ఎట్టకేలకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోగా… 33 మందికి గాయాలైనట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు తమ కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందగా… మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై యాజమాన్యం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు సిగాచి కంపెనీ యాజమాన్యం… పేలుడు ఘటనపై స్పందించింది. ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
40 మంది మృతి
పాశమైలారంలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయం అందజేస్తామని తెలిపింది. ప్రమాదంలో 40 మంది చనిపోయారని… 33 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని స్పష్టం చేసింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని… బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సిగాచి కంపెనీ వెల్లడించింది. మీడియాలో వచినట్లు రియాక్టర్ పేలుడు ప్రమాదానికి కారణం కాదని తెలిపింది.పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత… ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపింది.90 రోజుల పాటు కంపెనీని తాత్కాలికంగా మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
మరోవైపు పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అడిగి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల బంధువులను పరామర్శించారు. అండగా ఉంటామని బాధితులకు భరోసాను కల్పించారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు.
అయితే ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనే దానిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావటం లేదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఒకలా ఉంటే… మరోవైపు కంపెనీ తాజాగా చెప్పిన వివరాలు మరోలా ఉన్నాయి. మరికొందరి ఆచూకీ కూడా లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. 18 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
టాపిక్