





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న టొవినో థామస్ మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట ఓటీటీలోకి వచ్చేస్తోంది. టొవినో థామస్ నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గానూ సక్సెస్ సాధించిన మూవీ ఇది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి నరివెట్ట (Narivetta). అక్కడి స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా నరివెట్ట నక్కల వేట పేరుతో తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమాను సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.
నరివెట్ట ఓటీటీ రిలీజ్ డేట్
నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిన మలయాళం మూవీ నరివెట్ట మే 23న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సోనీ లివ్ ఓటీటీ జులై 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జులై 2) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “నిజం ప్రతిధ్వనులు, అన్యాయం నీడలు.. నరివెట్ట మూవీని జులై 11 నుంచి కేవలం సోనీలివ్ లో మాత్రమే చూడండి” అనే క్యాప్షన్ తో ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
నరివెట్ట మూవీ గురించి..
మలయాళ స్టార్ హీరోలు టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు నటించిన నరివెట్ట మూవీ ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమాల్లో ఒకటి. రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.30 కోట్ల వరకూ వచ్చాయి. అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించాడు.
2003లో కేరళలో జరిగిన ముత్తంగ ఆదివాసీ నిరసనల ఆధారంగా నరివెట్ట సినిమా తీశారు. తమ భూ హక్కుల కోసం వాళ్లు చేసే పోరాటం, దానిని పోలీసులు అత్యంత క్రూరంగా అణచివేసిన తీరును ఈ నరివెట్ట సినిమాలో చూపించారు. ఇందులో పీటర్ వర్గీస్ అనే కానిస్టేబుల్ పాత్రలో టొవినో థామస్ నటించాడు. ఇక మరో సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు.. హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ పాత్ర పోషించాడు.
ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐఎండీబీలోనూ 7.5 రేటింగ్ సొంతం చేసుకుంది. 22 ఏళ్ల కిందట ఆ ఘటనను కళ్లకు కట్టిన ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో నరివెట్ట ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీలోకి ఈ మూవీకి మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం