25 ఏళ్లకే నాలుగో దశ క్యాన్సర్: ఆ హెల్త్ కోచ్ రెండేళ్లపాటు విస్మరించిన లక్షణాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

25 ఏళ్లకే నాలుగో దశ క్యాన్సర్: ఆ హెల్త్ కోచ్ రెండేళ్లపాటు విస్మరించిన లక్షణాలు ఇవే

HT Telugu Desk HT Telugu

రాత్రిపూట చెమటలు, అలసట.. 25 ఏళ్ల హెల్త్ కోచ్‌కి ఇవి చిన్న సమస్యలుగానే కనిపించాయి. కానీ, ఆ తర్వాతే అతడికి నాలుగో దశ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. ఈ అనుభవం ద్వారా అతడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోండి.

శరీరం చెప్పే సంకేతాలను గమనించాలన్న దిలన్ (Freepik)

మనలో చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోరు. రాత్రిపూట చెమటలు పట్టడం, అలసట, అప్పుడప్పుడు వచ్చే నొప్పులు వంటి వాటిని పెద్ద సీరియస్ సమస్యలు కావనుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఈ చిన్న లక్షణాలే ఏదో పెద్ద ప్రమాదానికి సంకేతాలు కావచ్చు. ప్రముఖ హెల్త్ కోచ్ దిలన్, ఏప్రిల్ 8న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, తాను విస్మరించిన క్యాన్సర్ తొలి లక్షణాలను, అందరూ తప్పకుండా గమనించాల్సిన సంకేతాలను పంచుకున్నారు. అవేంటి?

తొలి సంకేతాలు ఏంటి?

“మొదట రాత్రిపూట చెమటలు పట్టడం మొదలైంది. కేవలం వేడిగా అనిపించడం కాదు.. నా దుప్పట్లు పూర్తిగా తడిసిపోయేలా చెమట పట్టేది” అని దిలన్ గుర్తు చేసుకున్నారు. “అర్థరాత్రి బట్టలు మార్చుకునేవాడిని, మళ్ళీ నిద్ర లేచేసరికి పూర్తిగా చెమటతో తడిసిపోయేవాడిని” అని వివరించారు.

‘‘ఆ తర్వాత దురద మొదలైంది. ఎంత గోకినా తీరని విపరీతమైన దురద. నా చర్మం రక్తం వచ్చే వరకు గోకాను. ఆ తర్వాత అలసట లక్షణాలు కనిపించాయి. నిద్రతో కూడా తీరని విపరీతమైన అలసట. ఏదో తప్పు జరుగుతోందని నా శరీరం నాకు చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించింది” అని తెలిపారు.

చివరికి ఛాతీ నొప్పి మొదలైనప్పుడు దిలన్ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. “వారు అది బహుశా నా వర్కవుట్స్ వల్ల కండరాల నొప్పై ఉంటుందని చెప్పారు” అని ఆయన వివరించారు. డాక్టర్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. “మరో 12 నెలల పాటు, తెలియని యుద్ధం చేస్తున్న నా శరీరంతో నేను జీవించాను” అని దిలన్ తెలిపారు.

తన మెడపై, చంక కింద గడ్డలు కనిపించే వరకు దిలన్‌కి ఏదో తీవ్రమైన సమస్య ఉందని తెలియలేదు. ఈసారి డాక్టర్ పరీక్షలు చేయించమని సిఫారసు చేశారు. “పరీక్షల ఫలితం వచ్చింది.. నాలుగో దశ 4B హాడ్జికిన్స్ లింఫోమా” అని తేలింది.

“నా లోపల దాదాపు రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ పెరుగుతూనే ఉంది” అని ఆయన చెప్పారు. “నా ఊపిరితిత్తులలో కూడా ఒక కణితి ఉంది. ఏడాది క్రితం నేను చెప్పిన ఛాతీ నొప్పికి కారణం అదే. భయం, కోపం, నమ్మలేకపోవడం, ఆందోళన వంటి ఊహించని భావోద్వేగాలన్నీ నన్ను చుట్టుముట్టాయి” అని వివరించారు.

25 ఏళ్లకే క్యాన్సర్ ఎలా వచ్చింది?

“నా శరీరం ఏదో తేడా ఉందని గట్టిగా అరుస్తున్నప్పుడు ‘బహుశా ఏమీ కాదులే’ అని అంగీకరించకుండా, నేను మరింత గట్టిగా అడిగి ఉంటే బాగుండేది” అని దిలన్ వాపోయారు.

“మీరు ఈ కథనాన్ని చదువుతుంటే, మీ శరీరంలో ఏదైనా తేడాగా అనిపిస్తే, దయచేసి ఆ భావనను వినండి. వైద్య నిపుణులు కూడా మీ ఆందోళనలను కొట్టిపారేయడానికి అనుమతించవద్దు. మీ ఆరోగ్యం చాలా విలువైనది. దానిని తేలికగా తీసుకోవద్దు.” అని హితవు పలికారు.

క్యాన్సర్ నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, మన శరీరాలు అరవడం మొదలుపెట్టడానికి ముందు మనకు గుసగుసలుగా మాట్లాడుతాయి. నా శరీరం ఎవరూ వినకముందే రెండేళ్ల పాటు గుసగుసలాడింది. అరుపు వచ్చే వరకు వేచి ఉండకండి.” అని సూచించారు.

(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024