




Best Web Hosting Provider In India 2024

మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు – పెరుగుతున్న కేసులు…!
పార్వతీపురం మన్యం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండడంతో వైద్య సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతోంది.
వర్షాకాలం రావటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ జ్వరాలతో చాలా మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డులు కిక్కిరిసిపోతున్నాయి.
రోగుల తాకిడి పెరుగుతుండడంతో పలు ప్రభుత్వ ఆస్పత్రులు సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురు రోగులు చికిత్స పొందుతుండటంతో పరిశుభ్రత, నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మన్యం జిల్లా మొత్తం కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్ల విద్యార్థుల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర జ్వరంతో చేరిన పలువురు చిన్నారులకు మలేరియా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.
సాలూరు ఏరియా ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసినప్పటికీ కొత్త భవనం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఫలితంగా ఆసుపత్రిలో పడకల కొరత, సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
సాలూరు ఆస్పత్రిలో ప్రస్తుతం 300 మందికి పైగా ఔట్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారని… 130 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వర్షాకాలం తీవ్రరూపం దాల్చడంతో జ్వరాల కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మందులు, మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా సరిపడా పడకలు లేకపోవడం ఇబ్బదికరంగా మారింది.
పెరిగే అవకాశం ఉంది – డాక్టర్ గోపాల్ రావ్, మెడికల్ సూపరింటెండెంట్
సాలూరు ఏరియా ఆసుపత్రి ఇన్చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ రావ్ మాట్లాడుతూ…. 100 పడకల కొత్త భవనం ఇంకా నిర్మాణంలో ఉందని వివరించారు. ఇది పూర్తయితే ఆరోగ్య సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
“ప్రస్తుతం ఈ నెల 30వ తేదీ వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20 నుంచి 30 వరకు జ్వరాలు ఉన్నాయి. సరైన తాగునీరు లేకపోవడం వల్ల డయేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఆసుపత్రిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా. గత కొన్ని రోజులుగా జ్వరాల కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే మరోసారి పెరిగే అవకాశం ఉంది ” అని ఆయన పేర్కొన్నారు.
గత 20 రోజులుగా జ్వరాల కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని గోపాల్ రావ్ చెప్పారు. కానీ ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పారు. డయేరియా కేసులు తరచూ కనిపిస్తూనే ఉన్నాయని వివరించారు. వీటితో పాటు, జంతువులకు సంబంధించిన గాయాలు, ముఖ్యంగా పాము కాటు, కుక్క కాటుతో పలువురు ఆస్పత్రులకు వస్తున్నట్లు పేర్కొన్నారు.
టాపిక్