





Best Web Hosting Provider In India 2024

ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓ విజువల్ ఫీస్ట్.. ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్.. అతిపెద్ద సైబర్ అటాక్‌ను ఎలా అడ్డుకున్నారంటే?
జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops 2) ఓ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతూ తొలి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు సీట్లకు అతుక్కుపోయి బింజ్ వాచ్ చేసేలా ఉంది.
ఇండియన్ ఓటీటీ స్పేస్ లో అసలు సిసలు స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చెప్పిన సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). జియోహాట్‌స్టార్ లో తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? గత సీజన్లలాగే మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
వెబ్ సిరీస్: స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops Season 2)
ఓటీటీ: జియోహాట్‌స్టార్
నటీనటులు: కే కే మేనన్, ప్రకాష్ రాజ్, కరణ్ టక్కర్, తాహిర్ రాజ్ భాసిన్, ముజమ్మిల్ ఇబ్రహీం, సయామీ ఖేర్
డైరెక్టర్: నీరజ్ పాండే, శివమ్ నాయర్
ఎపిసోడ్లు: 7 (ఫ్రైడే, సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే, వెన్స్‌డే, థర్స్‌డే)
స్పెషల్ ఆప్స్ సీజన్ 2 స్టోరీ ఇదీ..
స్పెషల్ ఆప్స్ సీజన్ 1 తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయింది. తర్వాత 1.5 అంటూ ఓ షార్ట్ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు రెండో సీజన్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండో సీజన్ లోనూ హిమ్మత్ సింగ్ పాత్రలో తిరిగి వచ్చాడు విలక్షణ నటుడు కే కే మేనన్. అతనితోపాటు అతని టీమ్ ఓ కొత్త మిషన్ పై పని చేయడం ఇందులో చూడొచ్చు. ఇండియా టాప్ సైంటిస్ట్, మన రక్షణ, ఆర్థిక రంగాలకు చెందిన అన్ని టాప్ సీక్రెట్స్ తెలిసిన పీయూష్ భార్గవ (ఆరిఫ్ జకారియా) కిడ్నాప్ చుట్టూ ఈ రెండో సీజన్ తిరుగుతుంది.
సుధీర్ అవస్థి (తాహిర్ రాజ్ భాసిన్) అనే ఇండియన్ బిజినెస్‌మ్యాన్ హంగేరీలోని బుడాపెస్ట్ లో అతన్ని కిడ్నాప్ చేయిస్తాడు. అదే సమయంలో ఇండియాలోని ఢిల్లీలో ఓ రా ఏజెంట్ హత్య జరుగుతుంది. ఈ రెండు కేసులోని పరిష్కరించడానికి రంగంలోకి దిగుతారు హిమ్మత్ సింగ్, అతని టీమ్. ఓవైపు సైంటిస్ట్ ను సురక్షితంగా విడిపించే ప్రయత్నంతోపాటు బ్యాంక్ స్కామ్ చేసి దేశం వదిలి పారిపోయిన జిగ్నేష్ ఢోలాకియాను కూడా తిరిగి దేశానికి తీసుకొచ్చే పనిలో పడతాడు హిమ్మత్ సింగ్.
అతనికి అతని టీమ్ మెంబర్స్ ఫరూఖ్ (కరణ్ టక్కర్), అవినాష్ (ముజామిల్ ఇబ్రహీం) లాంటి వాళ్లు సాయం చేస్తారు. ఈ రెండో సీజన్ చాలా వరకు బుడాపెస్ట్, లండన్, జార్జియాలాంటి చోట్ల సాగుతుంది. రెండో సీజన్ లో ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాంక్ స్కామ్ చేసిన పారిపోయిన వ్యక్తిని తిరిగి ఇండియాకు తీసుకురావాల్సిందే అని పట్టుబట్టే సుబ్రమణ్యం అనే పాత్రలో అతడు నటించాడు.
స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఎలా ఉందంటే?
స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఓ పర్ఫెక్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ప్రతి క్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతుంది. ఒక్క నిమిషం మిస్ కాకుండా చేస్తూ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. సిరీస్ చూస్తున్నంతసేపు మెదడులో అడ్రినలిన్ పరుగెత్తుతూనే ఉంటుంది. వీటికి తోడు రెండో సీజన్ ఓ విజువల్ ఫీస్ట్ అని కూడా చెప్పాలి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన లొకేషన్లు అలా ఉన్నాయి. బుడాపెస్ట్, జార్జియా, లండన్ లాంటి చోట్ల మంచి మంచి లొకేషన్లలో ఈ సిరీస్ తీశారు.
ఇక ఎప్పటిలాగే హిమ్మత్ సింగ్ పాత్రలో కే కే మేనన్ నటన మరో లెవెల్. ఆ పాత్రలో అతడిని తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా సాగింది. ఈ రెండో సీజన్ కు ప్రకాష్ రాజ్ కూడా తోడవడంతో సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇండియాలో కొన్నేళ్ల కిందట జరిగిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బ్యాంక్ స్కామ్ ను గుర్తుకు తెచ్చేలా ఈ రెండో సీజన్ లో బ్యాంక్ స్కామ్ ఎపిసోడ్ నడిపించారు.
భారీ రన్‌టైమ్‌తో ఎపిసోడ్లు
స్పెషల్ ఆప్స్ సీజన్ 2 రన్ టైమ్ చాలా ఎక్కువే. అంతేకాదు ఒక్కో ఎపిసోడ్ కు వారాల పేర్లను పెట్టడం విశేషం. ఈ రెండో సీజన్ ఫ్రైడే మొదలై థర్స్‌డేతో ముగుస్తుంది. ఆ వారం గ్యాప్ లో ఏం జరిగిందన్నది ఇందులో చూడొచ్చు.
శుక్రవారం (Friday): ఇది మొదటి ఎపిసోడ్. దీని నిడివి దాదాపు గంట. ఏఐ సైంటిస్ట్ డాక్టర్ భార్గవ్ కిడ్నాప్, ఢిల్లీలో ఒక సీనియర్ రా అధికారి వినోద్ షెకావత్ హత్యతో మొదలవుతుంది. హిమ్మత్ తన పని మొదలు పెడతాడు.
శనివారం (Saturday): ఈ ఎపిసోడ్ కూడా సుమారు గంట ఉంటుంది. అసలు ఈ షెకావత్ హత్యకు, భార్గవ్ కిడ్నాప్ కు ఉన్న లింక్ గురించి హిమ్మత్ తెలుసుకునే ఎపిసోడ్ ఇది.
ఆదివారం (Sunday): ఈ ఎపిసోడ్ నిడివి సుమారు 48 నిమిషాలు. అవినాష్ బుడాపెస్ట్‌లో ఒక కీలక ఆధారాన్ని కనుగొంటాడు. చైనా రహస్య సైబర్ యుద్ధంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని హిమ్మత్ తెలుసుకుంటాడు. ఇది భారతదేశాన్ని అస్థిరపరచడానికి రూపొందించిన పెద్ద డిజిటల్ దాడి అని కూడా అర్థం చేసుకుంటాడు.
సోమవారం (Monday): ఈ ఎపిసోడ్ 37 నిమిషాల నిడివితో ఉంటుంది. సుబ్రమణ్యం ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలనుకుంటున్న జిగ్నేష్ ధోలాకియాను గుర్తించడానికి అవినాష్, జూహి డొమినికాకు వెళ్తారు.
మంగళవారం (Tuesday): ఈ ఎపిసోడ్ నిడివి సుమారు 46 నిమిషాలు. ఉచ్చు బిగుసుకుపోతున్న కొద్దీ.. హిమ్మత్ తమ దగ్గరే ఒక గూఢచారి ఉన్నాడని అనుమానిస్తాడు. ఇది అతన్ని అసలు విలన్ వద్దకు నడిపిస్తుంది.
బుధవారం (Wednesday): ఈ ఎపిసోడ్ సుమారు 42 నిమిషాలు ఉంటుంది. రాబోయే సైబర్ యుద్ధాన్ని నడిపిస్తున్న సుధీర్ అవస్థి ఎవరో, అతని కథేంటో హిమ్మత్ తెలుసుకుంటాడు.
గురువారం (Thursday): ఇది చివరి ఎపిసోడ్. దీని నిడివి సుమారు 57 నిమిషాలు. సుధీర్ అవస్థిని హిమ్మత్, అతని టీమ్ ఎలా న్యూట్రలైజ్ చేస్తుందో చూడొచ్చు.
ఓవరాల్‌గా ఈ స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఓ మస్ట్ వాచ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని చెప్చొచ్చు. జియోహాట్‌స్టార్ లో ఈ వీకెండ్ చూసేయండి.
సంబంధిత కథనం