




Best Web Hosting Provider In India 2024

ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 4 రోజులు భారీ వర్షాలు – ఈ 9 జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు
ఏపీ, తెలంగాణకు మరోసారి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. గత కొన్నిరోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఈనెల 24వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది.
ఇవాళ(జూలై 20)అల్లూరి సీతారామరాజు,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి,కడప,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణకు భారీ వర్ష సూచన – ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలోనూ మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వానలు పడొచ్చు.
రేపు(జూలై 21) రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అయితే మహబూబాబాద్, వరరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇక హైదరాబాద్ నగరంలో ఇవాళ మోస్తారు వర్షం పడొచ్చు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడన వానలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
టాపిక్