



Best Web Hosting Provider In India 2024

కులగణనపై 24న ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణలో చేపట్టిన కులగణన (Caste Census) అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన (Caste Census) అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలకు కులగణన వివరాలతో పాటు, రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (BC) కోటాను 42 శాతానికి పెంచే విషయంపై ఆయన వివరించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ మల్లు రవి సోమవారం పీటీఐ వార్తా సంస్థకు ఈ వివరాలను వెల్లడించారు. బీసీలకు కోటా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గురించి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి, పార్టీ ఎంపీలకు వివరిస్తారని ఆయన తెలిపారు.
“వెనుకబడిన తరగతుల కోటాను పెంచడంపై ముఖ్యమంత్రి జూలై 24న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి వివరిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీలందరికీ తెలియజేస్తారు” అని మల్లు రవి అన్నారు.
నివేదిక సమర్పణ.. స్వతంత్ర కమిటీ నియామకం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల సర్వేను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ (IEWG) ఇటీవల ముఖ్యమంత్రికి తమ సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ సర్వే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత, ఈ ఏడాది మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యుల ఈ కమిటీ, కులగణన డేటా, దాని ఫలితాలను స్వతంత్రంగా ధృవీకరించడానికి, విశ్లేషించడానికి, సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఏర్పాటైంది.
రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం రెండు దశల్లో నిర్వహించిన ఈ కుల సర్వే దేశంలోనే మొదటిది. ఈ సర్వే కోసం 1,03,889 మందికి పైగా గణనదారులు, సూపర్‌వైజర్‌లను వినియోగించుకున్నారు. ఇప్పుడు ఈ నివేదిక, దాని ఆధారంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.
టాపిక్
