






Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ఉండగానే థియేటర్లలో కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్.. 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
ఓటీటీలో ఉండగానే థియేటర్లలో రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మై బేబీ. సురేష్ కొండేటి తీసుకొచ్చిన డీఎన్ఏ సినిమాకు తెలుగులో సైతం హిట్ టాక్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే ఓటీటీ రిలీజ్ అయిన మై బేబీ 3 రోజుల కలెక్షన్స్ ఎంతో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా ఓ సినిమా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ సాధించడం, లేదా ఫ్లాప్‌గా మిగిలిపోవడం వంటివి జరుగుతుంది. ఆ తర్వాత ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారు. అయితే, కొన్నిసార్లు ఇది రివర్స్ అయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
మరుసటి రోజే ఓటీటీకి
ఇదిలా ఉంటే, కొన్నిసార్లు థియేటర్లలో విడుదలైన సినిమాలు సుమారుగా 10 నుంచి నెల లేదా ఆపై ఎక్కువ కాలం తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుంటాయి. కానీ, రీసెంట్గా ఓ సినిమా మాత్రం థియేటర్లలో విడుదలైన తెల్లారే అంటే ఆ మరుసటి రోజే ఓటీటీ రిలీజ్ అయింది. దీంతో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు దీనికంటే మరింత ఇంట్రెస్టింగ్ విషయం మరొకటి జరిగింది. ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మై బేబీ. తమిళంలో తెరకెక్కిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ సినిమాను తెలుగులో మై బేబీగా రిలీజ్ చేశారు.
కోలీవుడ్ హిట్ మూవీ
తమిళ హీరో, గద్దల కొండ గణేష్ ఫేమ్ అధర్వ మురళి, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న డీఎన్ఏ సినిమాను తెలుగులో మై బేబీ టైటిల్‌తో విడుదల చేశారు నిర్మాత సురేష్ కొండేటి.
దీనికి సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి ఉన్నారు. ఈ నెల అంటే జూలై 18న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో డీఎన్ఏ సినిమా మై బేబీ టైటిల్‌తో విడుదల అయింది. ఆ తర్వాత మరుసటిరోజే జూలై 19న మై బేబీ ఓటీటీ రిలీజ్ అయింది.
ఓటీటీ ట్రెండింగ్‌లో
జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోసహా ఐదు భాషల్లో మై బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతే కాకుండా జియో హాట్‌స్టార్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో రెండో స్థానంలో దంచికొడుతోంది. ఓ పక్క ఓటీటీలో సత్తా చాటుతున్న మే బేబీ మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
మై బేబీ సినిమా విడుదలైన మూడు రోజులకే రికార్డు స్థాయిలో 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసింది. రోజుల్లో రూ. 35 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో ఉండగా కూడా థియేటర్లలో ఇలాంటి కలెక్షన్స్ సాధించడం విశేషమనే చెప్పుకోవాలి.
పెద్ద విజయం సాధించిన
ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన జాబితాలో మై బేబీ ఒకటిగా నిలిచింది. థియేటర్లో మై బేబీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది. ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుంది.
ఇకపోతే కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్కే పిక్చర్స్ ఏ మాత్రం తన బ్రాండ్ ఇమేజ్ను తగ్గించుకోలేదని మళ్లీ నిరూపించుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయం మరోసారి రుజువైంది.
సంబంధిత కథనం