వర్షాలపై అలర్ట్ గా ఉండండి – జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024

వర్షాలపై అలర్ట్ గా ఉండండి – జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

రాష్ట్రంలోని వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ వంటి అయిదు కీలక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

ప్రస్తుత సీజన్‌లో కలెక్టర్లు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కీలకమైన అయిదు విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి రోజూ వారి కార్యాచరణపై నివేదికలు సమర్పించాలని చెప్పారు. అత్యవసర పనుల కోసం ప్రతి కలెక్టర్ కి కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి – సీఎం రేవంత్ రెడ్డి

“రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. ప్రస్తుత సీజన్‌లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నష్టం జరిగితే ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. సీజన్‌లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

“వచ్చే రోజుల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల అంచనాలకు మించిన భారీ వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో వాతావరణ శాఖ అందించే సూచనలను ప్రజలకు చేరే విధంగా అప్రమత్తం చేయాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

“సీజన్‌లో డెంగీతో పాటు సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సర్వసన్నద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్లు పర్యవేక్షించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

“నీటి పారుదల వ్యవహారాల్లో నీటి నిల్వలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి. జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైంది. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదు. ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి డీలర్ వద్ద ఎరువులు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయన్నది స్టాక్ వివరాలను తెలియజేస్తూ షాపు ముందు విధిగా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రతి షాపు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.

“రాష్ట్రంలో 20-25 శాతం మేరకు ఎరువులను వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు వాడుతున్నట్టు ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి నడ్డా గారిని కలిసినప్పుడు చెప్పారు. ఈ విషయంలో అక్రమ రవాణా జరగకుండా నిఘాను అప్రమత్తం చేయాలి. దారి మళ్లించకుండా చూడాలి” అని తెలిపారు.

“వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా లాంటి ఎరువులను వ్యాపార అవసరాలకు ఎవరు మళ్లించినా క్రిమినల్ కేసులు నమోదు చేయండి. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. ఎరువులకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ కేటాయించండి. కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ గందరగోళపరుస్తున్నారు” అని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

“భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో నీటి నిల్వ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా ఆధ్వరంలోని 150 టీమ్‌లు ఎప్పటికప్పుడు రంగంలో ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుని ముందస్తుగా బృందాలను సిద్ధం చేసుకోవాలి” అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Cm Revanth ReddyTs RainsTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024