





Best Web Hosting Provider In India 2024

పవన్ కల్యాణ్‌లోని ఫైర్‌ను ఏ కెమెరా క్యాప్చర్ చేయలేదు.. హరి హర వీరమల్లుకు అతడు జీవం పోశాడు: డైరెక్టర్ క్రిష్ కామెంట్స్
పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు హరి హర వీరమల్లు మూవీ డైరెక్టర్లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి. దీనిపై మంగళవారం (జులై 22) అతడు తన ఎక్స్ అకౌంట్లో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చాడు. పవన్ లోని ఫైర్ ను ఏ కెమెరా క్యాప్చర్ చేయలేదని అతడు అనడం విశేషం.
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాలలో ఒకటైన ‘హరి హర వీర మల్లు’ జులై 24న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా, అందులో పవన్ నటనపై డైరెక్టర్లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి స్పందించాడు.
క్రిష్ జాగర్లమూడి ఏమన్నాడంటే..
తాజాగా, పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఎంతగానో ప్రశంసించాడు. ఈ సినిమా క్రిష్ కలల ప్రాజెక్ట్ అని అన్నాడు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా క్రిష్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత నిర్మాత కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. అయితే ఇప్పుడీ సినిమా, పవన్ కల్యాణ్ నటనపై క్రిష్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ చేశాడు. అందులో అతడు ఏమన్నాడో చూడండి.
“ఇప్పుడు హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. నిశ్శబ్దంగా కాదు.. ఒక లక్ష్యంతో, ప్రతి ఫ్రేమ్‌లో చరిత్ర, ప్యాషన్ బలంగా నిండి ఉన్నాయి. ఈ ప్రయాణాన్ని ఇద్దరు గొప్ప దిగ్గజాలు సాధ్యం చేశారు. కేవలం సినిమా రంగంలోనే కాదు.. మనిషిగానూ వాళ్లు గొప్పవారు.
మన పవన్ కళ్యాణ్ గారు.. ఏదో గొప్ప శక్తి ఆశీర్వదించిన ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఒక ఫైర్ ఉంది. ఏ కెమెరా కూడా దానిని పూర్తిగా క్యాప్చర్ చేయలేదు. అది లక్ష్యం నుండి వచ్చే ఒక శక్తి. ఆయనలోని ఎప్పుడూ మండుతున్న స్ఫూర్తే ఈ హరి హర వీరమల్లుకు జీవం పోసింది. ఆయన ఈ సినిమాకు వెన్నెముకను, ఆత్మను, తుఫానును అందించారు.
ఎ.ఎం. రత్నం గారు, భారతీయ సినిమాలోని కొన్ని గొప్ప అనుభవాల వెనుక ఉన్న శిల్పి. గొప్పగా చూడగల ఆయన సామర్థ్యం, విశ్వాసంతో నిర్మించగలగడం.. అరుదైనది. ఆయన అచంచలమైన బలం వల్లే హరి హర వీరమల్లు ఈ స్థాయిలో ఉంది” అని ఈ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇదో గొప్ప యుద్ధం
క్రిష్ ఈ హరి హర వీరమల్లు మూవీని తన అత్యంత ఇష్టంగా భావించే యుద్ధాలలో ఒకటిగా అభివర్ణించాడు. “ఈ సినిమా నా అత్యంత ఇష్టంగా భావించే యుద్ధాలలో ఒకటి.. కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు.. మరచిపోయిన చరిత్రను అన్వేషించే వాడిగా.. రుచించని నిజాలను బయటకు తెచ్చే వాడిగా.. ప్రపంచాన్ని నిర్మించడానికి ఒక అవకాశంగా.. అన్నింటికీ మించి వినోదంతో పాటు జ్ఞానాన్ని అందించే సినిమాను నమ్మేవాడిగా ఇదో గొప్ప సినిమా అని భావిస్తున్నాను. ఈ ఇద్దరు దిగ్గజాలు పవన్ కల్యాణ్ గారికి, ఏఎం రత్నం గారికి నా హృదయపూర్వక, లోతైన, అచంచలమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని క్రిష్ అన్నాడు.
ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన క్రిష్.. ఈ ప్రాజెక్ట్‌ను ఇంతకాలం నిలబెట్టినందుకు పవన్ కళ్యాణ్, నిర్మాత ఏ.ఎం. రత్నం ఇద్దరినీ ప్రశంసించాడు. హరి హర వీరమల్లు మొత్తానికి ఎన్నో వాయిదాల తర్వాత జులై 24న రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందే అంటే జులై 23 రాత్రి ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ సందడి మొదలు కానుంది.
సంబంధిత కథనం