గుండె బ్లాక్‌లను వ్యాయామంతో తగ్గించగలమా? కార్డియాలజిస్ట్ చెప్పిన కీలక విషయాలు

Best Web Hosting Provider In India 2024

గుండె బ్లాక్‌లను వ్యాయామంతో తగ్గించగలమా? కార్డియాలజిస్ట్ చెప్పిన కీలక విషయాలు

HT Telugu Desk HT Telugu

గుండెలో ఏర్పడిన బ్లాక్‌లను వ్యాయామంతో తొలగించవచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయమై ఒక కార్డియాలజిస్ట్ అందించిన సమాచారం ఇక్కడ ఉంది.

గుండె బ్లాక్‌లను వ్యాయామంతో తగ్గించగలమా? (Pixabay )

గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం, వ్యాధులను నివారించడం కోసం వ్యాయామం చాలా ముఖ్యం. అయితే గుండెలో ఏర్పడిన బ్లాక్‌లను వ్యాయామంతో తొలగించవచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయమై ఒక కార్డియాలజిస్ట్ అందించిన సమాచారం ఇక్కడ ఉంది.

నాన్-ఇన్వేసివ్ కార్డియాలజీ నిపుణుడు, కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ తన వెబ్‌సైట్ Saaol.comలో ఏప్రిల్ 9, 2025న ఒక కథనాన్ని రాశారు. గుండె జబ్బులను నివారించడంలో, వాటిని నియంత్రించడంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ఆయన అందులో వివరించారు. ఈ కథనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు ఒకటి. గుండె ధమనులలో అథెరోస్ల్కెరోసిస్ వల్ల బ్లాక్‌లు ఏర్పడటం దీనికి ముఖ్య కారణం.

చిన్న మార్పులు పెద్ద తేడాను చూపిస్తాయి

“ధమనులలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గి, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వంటివి దీనికి ముఖ్య కారణాలు. వ్యాయామం నేరుగా ధమనిలో పేరుకుపోయిన ప్లేక్‌ను తొలగించలేకపోవచ్చు. కానీ, వ్యాయామం వల్ల ధమనులలో మరింత కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అంతేకాకుండా గుండె పనితీరును, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని డాక్టర్ ఛాజెర్ స్పష్టం చేశారు.

“క్రమం తప్పకుండా చేసే వ్యాయామం గుండెను బలంగా చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు” అని ఆయన వివరించారు.

వ్యాయామంతో గుండె బ్లాక్‌లను నివారించవచ్చా?

గుండె బ్లాక్‌లు లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే, ధమనులలో కొవ్వు పేరుకుపోయి, గుండెకు రక్త ప్రవాహం తగ్గడం. దీనివల్ల ఛాతీ నొప్పి, ఆయాసం లేదా గుండెపోటు వంటివి రావచ్చని కార్డియాలజిస్ట్ వివరించారు. “అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి ఈ సమస్యకు కారణాలు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి ఈ బ్లాక్‌లను నివారించడంలో సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు.

“వ్యాయామం గుండె బ్లాక్‌లను పూర్తిగా తొలగించలేకపోవచ్చు, కానీ ప్రారంభ దశలో ఉండే అథెరోస్ల్కెరోసిస్‌ను నెమ్మదించడంలో లేదా బ్లాక్ అవ్వకుండా చాలా సహాయపడుతుంది” అని డాక్టర్ ఛాజెర్ చెప్పారు. వ్యాయామంతో గుండె బ్లాక్‌లను ఎలా తగ్గించుకోవచ్చో కూడా ఆయన వివరించారు. “రోజువారీ జీవితంలో కార్డియోవాస్కులర్ వ్యాయామాలు (నడక, పరుగు, ఈత, సైక్లింగ్ వంటివి), ఫ్లెక్సిబిలిటీ శిక్షణ, రెసిస్టెన్స్ వర్కౌట్స్ (రెసిస్టెన్స్ బ్యాండ్స్ లేదా పుష్-అప్స్, స్క్వాట్స్ వంటివి), యోగా, తరచుగా కదలడం వంటివి గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి” అని డాక్టర్ సూచించారు.

“ఈ వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, రక్తపోటును తగ్గిస్తాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. సమతుల్యమైన దినచర్య గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె పనితీరును దీర్ఘకాలం కాపాడుతుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం చురుకుగా ఉండండి” అని ఆయన సూచించారు.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024