


Best Web Hosting Provider In India 2024

తప్పుడు కేసులతో భయం పుట్టిస్తున్నారు.. న్యాయవాదులే పోరాడాలి: వైఎస్ జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, దీనిపై న్యాయవాదులు పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని, దీనిపై న్యాయవాదులు పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తప్పుడు కేసులతో ప్రజల్లో భయం పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికార దుర్వినియోగంపై జగన్ విమర్శలు
రాష్ట్రంలో ప్రమాదకరమైన అధికార దుర్వినియోగం జరుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. “నిజం చెప్పేవారిని, ప్రశ్నించేవారిని అక్రమంగా జైలులో పెడుతున్నారు. రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిపై పోరాడటానికి న్యాయవాదులు ముందుకొచ్చి బాధితులకు అండగా నిలబడాలి” అని ఆయన అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల మీద మరింత పెద్ద బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం న్యాయం, నైతిక విలువలను కాలరాస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెడుతోందని జగన్ ఆరోపించారు. బెదిరించి, లంచాలు ఇచ్చి వాంగ్మూలాలను తీసుకుంటున్నారని, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ పార్టీకి బలం
న్యాయవాదులు పిటిషన్లు వేసి, కోర్టులో వాదనలు వినిపిస్తేనే న్యాయం జరుగుతుందని జగన్ చెప్పారు. పార్టీకి న్యాయ విభాగం ఒక బలమైన శక్తి అని, న్యాయవాదుల కృషిని పార్టీ గుర్తిస్తుందని, గుర్తుపెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు రూ. 100 కోట్లు కేటాయించడం, వారి ఇన్సూరెన్స్ ప్రీమియంలలో మూడింట ఒక వంతు ప్రభుత్వమే భరించడం, యువ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించే ‘లా నేస్తం’ వంటి పథకాలను ప్రస్తావించారు.
అవినీతి, తప్పుడు హామీలపై విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వంటి తప్పుడు హామీలిచ్చి న్యాయవాదులను కూడా మోసం చేసిందని జగన్ ఆరోపించారు. అక్రమంగా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడుస్తున్నాయని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారని, కాంట్రాక్టులలో భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “మా ప్రభుత్వం ఒక్క యూనిట్ విద్యుత్‌ను రూ. 2.49కే కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వం రూ. 4.60కి కొంటోంది” అని జగన్ అన్నారు. చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టాలంటే కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. కొందరు పోలీసులు అక్రమ కార్యకలాపాలకు, జూదానికి సహకరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
సమస్యలను తెలిపేందుకు కొత్త యాప్
ప్రజలు తమకు జరిగిన అన్యాయాలను, దానికి సంబంధించిన సాక్ష్యాలను పంపించేందుకు త్వరలోనే ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తామని జగన్ ప్రకటించారు. “ఈ సమాచారం డిజిటల్ లైబ్రరీలో నిల్వ చేసి, అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు.
టాపిక్