




Best Web Hosting Provider In India 2024

ఏపీ – తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 4 రోజులు భారీ వర్షాలు – ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరికొన్నిరోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ఎల్లో హెచ్చరికలు జారీ…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(ఆగస్ట్ 07) రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. పలుచోట్ల 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
ఆగస్ట్ 8వ తేదీన ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. పలుచోట్ల 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
ఆగస్ట్ 9వ తేదీన వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. పలుచోట్ల 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్ట్ 10 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు…
హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపుర్, మియాపూర్, మదీనాగుడా, చందానగర్, లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీగా వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దేందుకు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తున్నాయి.
ఏపీలోనూ వర్షాలు:
రాయలసీమ,పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ(ఆగస్ట్ 06) మన్యం,అల్లూరి, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను ప్రకటించింది.
టాపిక్