ముంబైలో అతి భారీ వర్షాలకు ప్రజలు విలవిల- మహారాష్ట్రలో యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్​ జారీ..

Best Web Hosting Provider In India 2024


ముంబైలో అతి భారీ వర్షాలకు ప్రజలు విలవిల- మహారాష్ట్రలో యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్​ జారీ..

Sharath Chitturi HT Telugu

మహారాష్ట్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ముంబై తడిసి ముద్దవుతోంది. ఆగస్ట్​ 20 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ముంబైలోని ఓ రోడ్డు

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల దైనందిన జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటా క్రజ్, చెంబూర్, వర్లి, నవీ ముంబై, కొలాబా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ముంబైకి, వరుసగా రెండో రోజు, ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

ఐఎండీ జారీ చేసే హెచ్చరికలలో ‘ఆరెంజ్ అలర్ట్’ మూడో స్థాయి హెచ్చరిక. ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తుంది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు కూడా ‘యెల్లో’, ‘ఆరెంజ్’ అలర్ట్‌లను ఐఎండీ జారీ చేసింది. పూణెకి రెడ్​ అలర్ట్​ ఇచ్చింది.

ఆదివారం ఉదయం వర్ష తీవ్రత తగ్గినప్పటికీ, ఈరోజు ముంబైలో గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల మేర తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మేఘావృతమైన వాతావరణంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

భారీ వర్షాలతో ముంబై విలవిల..

భారీ వర్షాలు శుక్రవారం ముంబైని ముంచెత్తగా, ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల మధ్య ముఖ్యంగా పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనితో ఐఎండీ ముంబైకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

శనివారం తూర్పు శివారులోని విఖ్రోలి పార్క్‌సైట్ ప్రాంతంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే లైన్లపై ట్రాక్‌లపై నీరు నిలవడంతో లోకల్ రైళ్ల సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.

ఆదివారం కూడా ఐఎండీ ముంబై, థానే, రాయ్‌గడ్, పాల్ఘడ్​ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

నేడు, రేపు అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలు..

ఈరోజు నాసిక్, ఖండాలా, భీమశంకర్ రిజర్వ్, పుణె, మహాబలేశ్వర్, కొల్హాపూర్, సతారా, జల్గావ్, మాలేగావ్, ధూలే, చాలిస్‌గావ్, ఇగత్‌పురి, నందుర్బార్, కరాడ్, సాంగ్లి, తాస్‌గావ్, బారామతి, అహ్మద్‌నగర్, శ్రీరాంపూర్, షిర్డీ, జేయుర్, పంఢర్‌పూర్, సోలాపూర్, ఉస్మానాబాద్, బీడ్, పర్భణి, ఉద్గిర్, చంద్రపూర్, భ్రహ్మాపురి, గడ్చిరోలి జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ అయింది.

ముంబైతో పాటు దహను, విక్రమ్‌గడ్, అలిబాగ్, రాయ్‌గడ్ రిజర్వ్, శ్రీవర్ధన్, హర్నై, దాపోలి, రత్నగిరి, విజయ్‌దుర్గ్, దేవ్‌గడ్, మిత్‌భవ్ బీచ్, సింధుదుర్గ్, మాల్వన్, శ్రీరామ్‌వాడి, వెంగూర్ల, సావంత్‌వాడి జిల్లాలకు కూడా ఐఎండీ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో వాతావరణం..

ఐఎండీ అంచనాల ప్రకారం, ముంబైలో ఆగస్ట్​ 20 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఆగస్ట్​ 23 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి.

మధ్య మహారాష్ట్రలోని అహిల్యానగర్, ధూలే, జల్గావ్, నందుర్బార్, పుణె, సతారా, సాంగ్లి, సోలాపూర్, కొల్హాపూర్, నాసిక్ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఆగస్ట్​ 19, మంగళవారం వరకు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

మరాఠ్వాడాలోని బీడ్, ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, పర్భణి జిల్లాలకు ఈరోజు ‘ఆరెంజ్ అలర్ట్’, రేపు ‘యెల్లో’ అలర్ట్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ భారతంలో..

గుజరాత్ ప్రాంతం, సౌరాష్ట్ర, కచ్‌లకు ఈరోజు ‘ఆరెంజ్ అలర్ట్’, ఆగస్ట్​ 20 వరకు ‘రెడ్ అలర్ట్’ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. కొంకణ్, గోవా, విదర్భలకు కూడా నేడు, రేపు ‘రెడ్ అలర్ట్’ జారీ చేయగా, ఆగస్ట్​ 24 వరకు తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link