సెప్టెంబరు 5 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు – 3 రోజులపాటు పలు సేవలు రద్దు

Best Web Hosting Provider In India 2024

సెప్టెంబరు 5 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు – 3 రోజులపాటు పలు సేవలు రద్దు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలు ర‌ద్దు చేసినట్లు టీటీడీ ప్రక‌టించింది.

శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు (File Photo) (TTD)

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు ఉంటాయి.

ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 5వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750 చెల్లించి గృహస్తులు (ఒకరికి ఒక రోజు ) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈనెల 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం…

పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 4వ తేదీన అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 5వ తేదీ అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ సేవలను రద్దు చేశారు. ఆదేవిధంగా సెప్టెంబరు 5, 6, 7వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.

సెప్టెంబరు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 2వ తేదీన‌ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వ‌హిస్తారు.

అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

TtdDevotionalAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024