భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం.. ఐఎండీ రెడ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

Best Web Hosting Provider In India 2024


భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం.. ఐఎండీ రెడ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవు

Anand Sai HT Telugu

రానున్న 48 గంటలు అత్యంత కీలకమని ముంబై వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ముంబయిలో భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 24 గంటల్లో ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. పలు రైల్వే లైన్లు నీటిలో మునిగిపోవడంతో ముంబైకి జీవనాడిగా పిలిచే లోకల్ రైళ్లకు కూడా బ్రేక్ పడింది. పలు చోట్ల లోకల్ రైళ్లను నిలిపివేశారు.

సియోన్-కుర్లా, సీఎస్ఎంటీ-కర్జాత్ మార్గాలను మూసివేశారు. ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైకోర్టు భవన ఆవరణలోకి కూడా నీరు చేరింది. రానున్న 48 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని సమీక్షించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. దీనికితోడు పెద్ద ఎత్తున ఆస్తులు, పంటలు కూడా దెబ్బతిన్నాయి. వర్షం, వరదల కారణంగా వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. గడ్చిరోలి, మరాఠ్వాడా ప్రాంతం, నాందేడ్ సహా ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తున్నామని, నీటి నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. పంట నష్టాన్ని పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టుగా చెప్పారు.

మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపే బాంబే హైకోర్టులో వర్షం కారణంగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు విచారణ జరగలేదు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసిన ‘రెడ్ అలర్ట్’ దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. కొంకణ్ ప్రాంతంలోని అన్ని కళాశాలలకు డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెలవు ప్రకటించింది.

భారీ వర్షాలు విమానయాన రంగాన్ని కూడా ప్రభావితం చేశాయి. కనీసం ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం సాయంత్రం ముంబైలో కురిసిన భారీ వర్షానికి మైసూరు కాలనీ- భక్తి పార్క్ స్టేషన్ల మధ్య నిలిచిపోయిన మోనోరైల్ రైలులో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఇతర ఏజెన్సీలు క్రేన్ల సహాయంతో ప్రయాణికులను రక్షించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link