




Best Web Hosting Provider In India 2024
Modi China visit : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య సమావేశం జరిగింది.
ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు ఒకదానికొకటి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమ్మిట్ 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరుకున్న ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమవుతారు. ఈ సమ్మిట్ సందర్భంగానే మోదీ.. తాజాగా జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా వీరు రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో కలుసుకున్నారు.
“పరస్పర నమ్మకంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళదాము. సరిహద్దులో శాంతి, స్థిరత్వం ఉంది. కైలాశ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య విమానాలు కూడా మొదలయ్యాయి. ఇరు దేశాల మధ్య సహాయ-సహకారాలతో, 2.8 బిలియన్ ప్రజల ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని ముందుకెళదాము. ఇది మానవత్వానికి చాలా అవసరం,” అని సమావేశంలో భాగంగా మోదీ జిన్‌పింగ్‌కి చెప్పారు.
అప్పుడు విభేదాలు- ఇప్పుడు స్నేహం..
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాతో సంబంధాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉంది. అలాగే అమెరికా సుంకాల వివాదం మధ్య ఐకమత్య సందేశాన్ని పంపడం కూడా ఈ భేటీకి సంబంధించి మరో ముఖ్య ఉద్దేశ్యం. దశాబ్దాలుగా ఇరు దేశాలను దూరం చేయడానికి అమెరికా ప్రయత్నించినప్పటికీ, ట్రంప్ వాణిజ్య, సుంకాల విధానాలు వాటిని దగ్గర చేస్తాయని పలువురు విదేశీ నిపుణులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమయ్యాయి.
చైనా పర్యటనకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంతో బలమైన సంబంధాలు ప్రాంతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. “ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య స్థిరమైన, ఊహించదగిన, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ- ప్రపంచ శాంతి. శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి,” అని ఆయన జపనీస్ మీడియాకు తెలిపారు. భారతదేశం-చైనా సంబంధాలు “మల్టీపోలార్ ఏసియా ప్రపంచానికి చాలా కీలకమైనవి,” అని ఆయన అభివర్ణించారు.
మోదీ చైనా పర్యటనకు సరిగ్గా రెండు వారాల ముందు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశ పర్యటన జరిగింది. భారత్-చైనా సంబంధాలు వేగంగా సాధారణ స్థితికి వచ్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. భారతదేశంలో ఉన్నప్పుడు, వాంగ్ యీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో చర్చలు జరిపారు. ఆయన భారతదేశంలో ప్రధాని మోదీని కూడా కలిశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link