




Best Web Hosting Provider In India 2024

జూబ్లీహిల్స్ బై పోల్ : మారిన ‘కాంగ్రెస్’ వ్యూహాం – తెరపైకి కొత్త అభ్యర్థులు..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. హస్తం జెండాను ఎగరవేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడింది.
రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ స్థానం ఖాళీగా ఉండగా… త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోపే ఇక్కడ ఉపఎన్నికల జరిగే అవకాశాలు ఉండటంతో… ప్రధాన పార్టీలు కొద్దిరోజులుగా వ్యూహా, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భాగ్యనగరంలో జరిగే ఉపఎన్నిక కావటంతో… బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ చేస్తోంది.
జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో…అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఫోకస్ పెట్టేసింది. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి… సత్తా చాటాలని భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేకపోయిన ఆ పార్టీ… ఆ తర్వాత కంటోన్మెంట్ లో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాతా తెరిచినట్లు అయింది. ఈ క్రమంలోనే… జూబ్లీహిల్స్ లోనూ విజయం సాధించి… నగరంలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది.
మారిన వ్యూహాం… అభ్యర్థి ఎవరు…?
గత అసెంబ్లీ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్ నుంచి అజహరుద్దీన్ పోటీ చేశారు. కానీ బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే గోపినాథ్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరగబోతుంది. అయితే మరోసారి కూడా తానే బరిలో ఉంటాని అజహరుద్దీన్ చెప్పుకొచ్చారు. పార్టీ కూడా ఆయన పేరును ప్రధానంగా పరిశీలించింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహాం మార్చేసింది.
ఇటీవలే తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. ఇందులో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను ఖరారును చేశారు. కోదండరామ్ తో పాటు అజారుద్దీన్ పేరు కూడా ఇందులో ఉంది. దీంతో అనూహ్యంగా బంజారాహిల్స్ రేసు నుంచి అజారుద్దీన్ తప్పుకోవటం ఖాయమైపోయింది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వరించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుత కేబినెట్లో మైనార్టీ విభాగం నుంచి ఎవరికి అవకాశం లేకపోవటంతో… అజారుద్దీన్ కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తద్వారా మైనార్టీ ఓట్లు కూడా ఈ ఉపఎన్నికలో కలిసి వచ్చే అవకాశం ఉందని హస్తం అధినాయకత్వం అంచనా వేస్తోంది.
తెరపైకి కొత్త పేరు…!
మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిగా అజారుద్దీన్ ఉంటారని భావించినప్పటికీ… ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు కావటంతో… కొత్త అభ్యర్థి పోటీలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా నవీన్ యాదవ్ పేరు వినిపిస్తోంది. గతంలో ఇదే స్థానం నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు. స్థానికంగా ఆయనకంటా గుర్తింపు ఉండటంతో… ఆయనకు టికెట్ ఇచ్చే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఆయనకు టికెట్ ఖరారు చేస్తే… ఎంఐఎం నుంచి కూడా మద్దతు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఇదే టికెట్ పై పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి, ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురు నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరే కాకుండా హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మీ పేరు కూడా తెరపైకి వస్తోంది. త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ పెద్దల ఆమోదం తర్వాత అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
ఇక ఉపఎన్నికలో గెలుపే లక్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ… స్థానికంగా బలపేతమయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసింది. కొందరు మంత్రులకు కూడా ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. కార్పొరేషన్ చైర్మన్లు కూడా రంగంలోకి దిగారు. వీరంతా కూడా ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో పని చేయనున్నారు. పకడ్బందీ ప్లాన్ తో ముందుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధినాయకత్వం… అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించే పనిలో పడింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు దక్కిన సంగతి తెలిసిందే…!
సంబంధిత కథనం
టాపిక్