




Best Web Hosting Provider In India 2024

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో ప్రవేశపెట్టిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ నిండిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. గంటలతరబడి చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదాను విస్మరించడమే కాకుండా, దాని డిజైన్‌ను మార్చి ఖర్చును రూ.1.5 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు.
కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజాయితీగా దర్యాప్తు జరగాలని కోరుతూ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామై ఉన్నందున కేసును సీబీఐకి అప్పగించడం సరైనదని శాసనసభ అనుకుంటున్నట్టుగా సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు దర్యాప్తు చేస్తే తమ చిత్తశుద్ధిని శంకిస్తారని సీబీఐకి అప్పగిస్తున్నట్టుగా తెలిపారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ తగ్గేవని.. కానీ కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద రూ.11,670 ఖర్చు చేసిన తర్వాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకునేందుకు మహారాష్ట్ర కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్ వినియోగం 8450 మెగావాట్లకు పెరిగిందని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం.. కాళేశ్వరం రీడిజైన్‌తో రూ.1.47లక్షల కోట్లకు చేరిందన్నారు.
నిజాం కంటే సంపన్నుడు కావాలనే దురాశ కలిగిందో.. లేదంటే కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చిందో కానీ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు దోచుకోవాలనే దురుద్దేశంతో తుమ్మిడిహెట్టి గురించి మరోసారి పరిశీలించాలని కేసీఆర్, హరీశ్ రావులు కేంద్రానికి లేఖ రాశారన్నారు. విశ్రాంత ఇంజినీర్ అనంతరాములు నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించారని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించొద్దని అనంతరాములు కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. లక్ష కోట్లు దోచుకోవాలనే ఆశతో బీఆర్ఎస్ విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు.
టాపిక్