




Best Web Hosting Provider In India 2024

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్‌లోనూ వానలు పడుతాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా కొన్ని చోట్లు అధిక వర్షాలు పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వర్షాలు
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉందన్నారు.
ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం శివార్లలో అనకాపల్లి పట్టణం, పెందుర్తి, సింహాచలం, గాజువాక, భీమిలి వైపు ఎక్కువ వర్షాలకు అవకాశాలు ఉన్నాయన్నారు.
తీరం వెంబడి గంటకు 40–60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో అభివృద్ధి చెందుతున్న అల్పపీడనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విస్తృత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘తేమతో కూడిన గాలులు ఉంటాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల వంటి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం.’ అని ఐఎండీ వాతావరణ శాస్త్రవేత్త కేఎస్ శ్రీధర్ అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. బంగాళాఖాతంలో అభివృద్ధి చెందుతున్న అల్పపీడన ప్రాంతం దాదాపు అన్ని జిల్లాలను ప్రభావితం చేస్తుందని ఐఎండీ రాబోయే 48 గంటల్లో భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
హైదరాబాద్, దాని పొరుగు జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరికు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
టాపిక్