PM Modi SCO: ఎస్​సీఓ వేదికగా పాకిస్థాన్​కి ప్రధాని మోదీ స్ట్రాంగ్​ వార్నింగ్​!

Best Web Hosting Provider In India 2024


PM Modi SCO: ఎస్​సీఓ వేదికగా పాకిస్థాన్​కి ప్రధాని మోదీ స్ట్రాంగ్​ వార్నింగ్​!

Sharath Chitturi HT Telugu

చైనా టియాంజిన్​ వేదికగా జరుగుతున్న జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పాకిస్థాన్​ ప్రధాని సమక్షంలోనే పహల్గామ్​ ఉగ్రదాడిని ప్రస్థావించి, ఉగ్రవాదం అనేది యావత్​ మానవాళికి ప్రమాదకరమని స్పష్టం చేశారు.

ఎస్​సీఓ సదస్సులో ప్రధాని మోదీ (Bloomberg)

పాకిస్థాన్ ప్రధానమంత్రి సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉగ్రవాదంపై బలమైన సందేశం ఇచ్చారు. 25వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో సవాలు కాదని, యావత్ మానవాళికి సవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై ఐక్య పోరాటం అవసరం..

చైనా టియాంజిన్​ వేదికగా జరుగుతున్న ఎస్​సీఓ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించారు. భద్రత, శాంతి, స్థిరత్వం అనేవి అభివృద్ధికి పునాదులని నొక్కి చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీఓ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

“ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యతకు కట్టుబడి ఉంది. ఇందులో ఎస్‌సీఓకు ముఖ్యమైన పాత్ర ఉంది,” అని మోదీ అన్నారు.

అల్‌-ఖైదాపై పోరాటంలో భారత్ ముందంజ..

ఈ నేపథ్యంలో అల్‌-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ చేస్తున్న పోరాటాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. “అల్‌-ఖైదా, దాని అనుబంధ సంస్థలపై పోరాటంలో భారత్ ముందంజలో ఉంది. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటీవల మనం పహల్గామ్ ఉగ్రదాడిని చూశాం. ఆ దాడి సమయంలో మాకు అండగా నిలిచిన మిత్ర దేశాలన్నింటికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను,” అని మోదీ అన్నారు.

పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్..

కొన్ని నెలల క్రితం జమ్ము-కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ ఈ బలమైన సందేశం ఇచ్చారు. ఆ దాడిలో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్న ఉగ్రవాదులు 26 మందిని కిరాతకంగా చంపారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్‘ను ప్రారంభించింది. మే 7న పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడులు చేసి, కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.

ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య నాలుగు రోజుల పాటు క్షిపణులు, డ్రోన్‌ల దాడులతో సైనిక ఘర్షణ జరిగింది. చివరకు ఈ చర్యలను ఆపాలని పాకిస్థాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత సైన్యాన్ని కోరడంతో ఈ ఘర్షణ ముగిసింది.

మోదీ- జిన్​పింగ్​, పుతిన్​ మాటలు..

ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఊహించని సమావేశం జరిగింది. ఈ ముగ్గురు నాయకులు ఒకరికొకరు స్వయంగా కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ సమావేశం తాలూకు ఫొటోలను ప్రధాని మోీ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ విధానాల వల్ల భారత్, చైనా, రష్యా దేశాలు ప్రభావితమైన నేపథ్యంలో ఈ నాయకులు ఒకే వేదికపైకి చేరి, ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

పుతిన్​, మోదీ, జిన్​పింగ్​ సంభాషణలు..
పుతిన్​, మోదీ, జిన్​పింగ్​ సంభాషణలు..

సదస్సులో పుతిన్, జిన్‌పింగ్‌లతో కలవడానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ప్రధాని మోదీ.. “టియాంజిన్‌లో సంభాషణలు కొనసాగుతున్నాయి! ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్, అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో అభిప్రాయాలను పంచుకుంటున్నాను,” అని రాశారు.

అంతేకాకుండా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసిన ఫొటోను షేర్ చేస్తూ.. “అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది!” అని పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు ఉమ్మడి వ్యూహాలపై చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.

ఇదే సదస్సులో పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ కూడా పాల్గొన్నారు. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షరీఫ్​తో మోదీ మాట్లాడలేదు. షరీఫ్​ని విస్మరించి పుతిన్​- మోదీలు మాట్లాడుకుంటూ ముందుకు కదులుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link