




Best Web Hosting Provider In India 2024

ఒత్తిడి, ఆందోళన తగ్గించే 3 అద్భుతమైన యోగాసనాలు
‘బాలాసనం’ నుంచి ‘విపరీత కరణి’ వరకు… శరీరానికి విశ్రాంతినిచ్చి, మనసును ప్రశాంతపరిచే యోగాసనాలు ఇవేనంటున్న యోగా నిపుణులు.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. ఇవి నిశ్శబ్దంగా మన శరీరం, మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, మనసుకు శాంతినిస్తుంది. సరైన యోగాసనాలను సాధన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమాలయన్ సిద్ధా అక్షర్ (ఆథర్, కాలమిస్ట్, అక్షర్ యోగా కేంద్ర స్థాపకుడు) మాట్లాడుతూ, “యోగా అనేది నాడీ వ్యవస్థను శాంతపరిచి, రోజువారీ జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి ఎంతో శక్తివంతమైన మార్గం. శ్వాసపై ధ్యాస పెట్టి, స్థిరమైన ఆసనాలు వేయడం ద్వారా శరీరం విశ్రాంతి పొందుతుంది. మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. ఫలితంగా అంతర్గత శాంతి లభిస్తుంది” అని వివరించారు. ఈ క్రమంలో, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఆయన సూచించిన మూడు యోగాసనాలు ఇక్కడ ఉన్నాయి.
1. బాలాసనం (శిశువు భంగిమ)
బాలాసనం వేసినప్పుడు తల నేలకు ఆని ఉంటుంది. ఇది ఒక రకమైన సురక్షితమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ఆసనం వెన్నెముకను సాగదీసి, వెనుక కండరాలకు విశ్రాంతినిస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడు నెమ్మదిగా, క్రమబద్ధంగా శ్వాస తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరి, అంతర్గతంగా శాంతి లభిస్తుంది.
2. విపరీత కరణి (కాళ్లు గోడపై ఆనించే భంగిమ)
ఈ ఆసనంలో కాళ్లను గోడపై ఆనించి పైకి ఉంచడం వల్ల గుండె వైపు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరచి, అలసటను తగ్గిస్తుంది. అలాగే, ఇది అలసట చెందిన కాళ్లకు విశ్రాంతిని ఇస్తుంది. మనసులోని గందరగోళపు ఆలోచనలను తగ్గిస్తుంది. కేవలం కొన్ని నిమిషాలు ఈ భంగిమలో ఉండటం వల్ల శరీరం, మనసు రెండూ రీఫ్రెష్ అయిన అనుభూతి కలుగుతుంది.
3. పశ్చిమోత్తాసనం (కూర్చుని ముందుకు వంగే భంగిమ)
ఈ ఆసనంలో నెమ్మదిగా ముందుకు వంగడం వల్ల అంతర్గత ఆలోచనలు, మనోభావాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఈ ఆసనం హామ్‌స్ట్రింగ్స్, వెన్నెముకను సాగదీయడంతో పాటు, భుజాలు, మెడలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. పశ్చిమోత్తాసనం సాధన చేయడం వల్ల శ్వాస నెమ్మదిస్తుంది. ఇది మనసుకు స్థిరత్వాన్నిచ్చి, స్పష్టతను పెంచుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
“ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం వల్ల శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. మనసు స్థిరంగా, శరీరం తేలికగా మారుతాయి. రోజుకు పది నిమిషాలు ఈ ఆసనాల కోసం కేటాయిస్తే, అశాంతి స్థానంలో శాంతి ఏర్పడుతుంది. అంతేకాక మానసిక స్థితి మరింత మెరుగుపడుతుంది” అని హిమాలయన్ సిద్ధా అక్షర్ తెలిపారు.
(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్య సంబంధిత సమస్యల కోసం నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.)