




Best Web Hosting Provider In India 2024

ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. 1.46 కోట్ల మంది లబ్ధిదారులు.. ఈ తేదీలోపు పంపిణీ పూర్తి!
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించే కార్యక్రమం మెుదలైంది.
ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 1.46 లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగుల గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానని ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం 1.46 కోట్ల మంది లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను అందుకోనున్నారు. వీరిలో గుంటూరు జిల్లాలో 5.85 లక్షలు, తెనాలి నియోజకవర్గంలో 83,000 మంది ఉన్నారు. ‘గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగులో ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది.’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సాటిలేని సంక్షేమాన్ని అందిస్తోంది అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 15 నాటికి స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తామని మనోహర్ గుర్తించారు. ‘క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయి. దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం.’ అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
దీపం 2 పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ఇచ్చే హామీని నిలబెట్టుకున్నామని మంత్రి మనోహర్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పార్టీలకు అతీతంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేషన్ పంపిణీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
దేశంలో తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డులను అమలు చేయడం గర్వకారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సంక్షేమంతోపాటు అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ చేసిన ఘటన కూటమి ప్రభుత్వానిదన్నారు. అమరావతి, పోలవరం పనులతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా చెప్పారు.
ఇప్పటికే కొత్తగా ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ డిపోలకు చేరాయి. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభమైంది.
టాపిక్