Afghanistan earthquake : అఫ్గానిస్థాన్​లో అల్లకల్లోలం- భారీ భూకంపానికి 600మంది బలి!

Best Web Hosting Provider In India 2024


Afghanistan earthquake : అఫ్గానిస్థాన్​లో అల్లకల్లోలం- భారీ భూకంపానికి 600మంది బలి!

Sharath Chitturi HT Telugu

Afghanistan earthquake today : అఫ్గానిస్థాన్​లో సంభవించిన భారీ భూకంపానికి మృతుల సంఖ్య 600 దాటింది. 1000మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జలాలాబాద్​ విమానాశ్రయం వద్ద పరిస్థితి.. (REUTERS)

అఫ్గానిస్థాన్​లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 600 దాటింది. నంగర్‌హర్ ప్రావిన్స్​లో సోమవారం సంభవించిన ఈ 6.3 తీవ్రత గల భూకంపం వల్ల మరో 1000 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొదట 250 మంది మరణించినట్లు సమాచారం రాగా.. ఆ తర్వాత ప్రభుత్వ మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్​(ఆర్టీఏ) ఈ సంఖ్యను 500కి పెంచింది. అనంతరం.. తాలిబాన్ ఆధ్వర్యంలోని అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా మరణాల సంఖ్య 622గా నిర్ధారించింది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ మాట్లాడుతూ.. “మరణాలు, గాయాల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా ఉన్నందున మా బృందాలు ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి,” అని పేర్కొన్నారు.

భూకంపం వివరాలు..

అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం, 6.3 తీవ్రతతో కూడిన ఈ భూకంపం నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో సంభవించింది. ప్రధాన భూకంపం తర్వాత, 4.7 తీవ్రతతో మరో భూకంపం సుమారు 140 కిలోమీటర్ల లోతులో సంభవించింది!

భారత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) ప్రకారం, ఈ భూకంపం ఆదివారం రాత్రి 11:47 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం), 160 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం తర్వాత 4 నుంచి 5 తీవ్రత గల ప్రకంపనలు వచ్చాయి.

6.3 తీవ్రతతో ప్రధాన భూకంపం సంభవించిన తర్వాత, 4.7 తీవ్రతతో మరో భూకంపం సుమారు 140 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత 4.3, 5.0 తీవ్రతలతో మరో రెండు ప్రకంపనలు వరుసగా 140 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల లోతులో సంభవించాయి.

భూకంపాలను అవి సంభవించే లోతు ఆధారంగా ‘షాలో’ లేదా ‘ఇంటర్మీడియట్’ భూకంపాలుగా వర్గీకరిస్తారు. లోతైన భూకంపాలతో పోలిస్తే, షాలో భూకంపాలు భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. అందువల్ల అవి మరింత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు! ఎందుకంటే, వీటి వల్ల వచ్చే భూకంప తరంగాలు తక్కువ దూరానికి వేగంగా ప్రయాణిస్తాయి. దీనివల్ల నేల తీవ్రంగా కంపిస్తుంది, భవనాలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.

ఈ భూకంపం ప్రభావం అఫ్గానిస్తాన్‌లోని చాలా ప్రాంతాలతో పాటు పాకిస్థాన్‌లోని పెషావర్, మాన్సెహ్రా, అబోటాబాద్, స్వాత్ వంటి ప్రాంతాల్లో కూడా కనిపించింది.

అఫ్గానిస్థాన్​ భూకంపం తర్వాత అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో భూమి తీవ్రంగా కంపించడం, ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది. భూకంపం తర్వాత ఇళ్లు పూర్తిగా ధ్వంసమై శిథిలాల కుప్పలుగా మారిన దృశ్యాలు ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి.

2023 తర్వాత అత్యంత ఘోరమైన భూకంపం..

సోమవారం సంభవించిన ఈ భూకంపం 2023 తర్వాత అఫ్ఘానిస్థాన్‌లో సంభవించిన అత్యంత ఘోరమైనది. రెండు సంవత్సరాల క్రితం.. ఇదే ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తర్వాత కూడా బలమైన ప్రకంపనలు వచ్చాయి. తాలిబాన్ ప్రకారం, ఆ భూకంపంలో సుమారు 4,000 మంది మరణించారు!

అయితే, ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, కనీసం 1,500 మంది మరణించారు.

భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే హిందూకుష్ పర్వత శ్రేణిలో అఫ్ఘానిస్థాన్ ఉండటం వల్ల తరచుగా ఇలాంటి ఘోరమైన భూకంపాలు సంభవిస్తుంటాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link