


Best Web Hosting Provider In India 2024

ఈద్-ఏ-మిలాద్-ఉన్ నబీ 2025: చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకల గురించి ఇవి మీకు తెలుసా?
Eid-e-Milad-un Nabi 2025: ఈద్-ఎ-మిలాద్-ఉన్ నబీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. ఇది ఇస్లాం మత స్థాపకుడైన ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజును సూచిస్తుంది.
ఈద్-ఎ-మిలాద్-ఉన్ నబీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. ఇది ఇస్లాం మత స్థాపకుడైన ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజును సూచిస్తుంది. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం, మూడవ నెల అయిన రబీ-ఉల్-అవ్వల్‌లో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం, ఇది సెప్టెంబర్ 4 లేదా 5వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీ చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటుంది. 2025లో ఈ పండుగ రబీ-ఉల్-అవ్వల్ 12వ తేదీన, 1447 AHన జరగనుంది.
చరిత్ర, ప్రాముఖ్యత
ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు వేడుకలు ఇస్లాం ప్రారంభ కాలం నుంచే ఉన్నాయి. కానీ ఈ వేడుకను అధికారికంగా గుర్తించి, నిర్వహించినవారు ఫాతిమిద్‌లు. చాలా మంది ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ 570 CEలో మక్కాలో, రబీ-ఉల్-అవ్వల్ 12న జన్మించారని నమ్ముతారు.
అరబిక్‌లో ‘మౌలిద్’ అనే పదానికి ‘పుట్టినరోజు’ అని అర్థం. అయితే ఈద్-ఎ-మిలాద్ ను కొంతమంది ముస్లింలు విషాద దినంగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఇది ప్రవక్త వర్ధంతి రోజు కూడా. ఈ పండుగను మొదట ఈజిప్ట్‌లో అధికారికంగా జరుపుకున్నారు, తర్వాత ఇది 11వ శతాబ్దంలో మరింత ప్రాచుర్యం పొందింది.
ప్రారంభంలో, ఈజిప్ట్‌ను పాలించిన షియా తెగ మాత్రమే ఈ పండుగను నిర్వహించేది. కానీ 12వ శతాబ్దం నాటికి సిరియా, మొరాకో, టర్కీ, స్పెయిన్ వంటి ఇతర దేశాలు కూడా జరుపుకోవడం ప్రారంభించాయి. అప్పటి నుంచి కొన్ని సున్నీ ముస్లిం తెగలు కూడా ఈ వేడుకను పాటించడం మొదలుపెట్టాయి.
వేడుకలు ఎలా జరుగుతాయి?
మొదట ఈద్-ఎ-మిలాద్ వేడుకలు ఈజిప్ట్‌లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ప్రార్థనలు, ఉపన్యాసాలు, ఖురాన్ పఠనాలు ఉండేవి. భారీ ఎత్తున భోజన విందులు కూడా నిర్వహించేవారు. కాలక్రమేణా, సూఫీ ప్రభావంతో వేడుకల పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. జంతు బలులు, బహిరంగ చర్చలు, రాత్రి వేళల్లో టార్చ్‌లైట్ ఊరేగింపులు, ప్రజలందరికీ భోజన విందులు వంటివి మొదలయ్యాయి.
నేటి రోజుల్లో, ముస్లింలు కొత్త దుస్తులు ధరించి, ప్రార్థనలు చేసి, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మసీదులు, దర్గా వద్ద ముస్లిం సమాజాలు గుమిగూడి, ఉదయం ప్రార్థనలతో రోజును ప్రారంభిస్తారు. ఆ తర్వాత పట్టణాల గుండా ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రవక్త జీవిత చరిత్ర, ఖురాన్ బోధనలను పిల్లలకు వివరిస్తారు. పేదలకు విరాళాలు, దానధర్మాలు చేయడం కూడా ఈ పండుగలో ఒక భాగం.