‘భక్తికి, విషాదానికి తేడా తెలియదా?’- ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్​తో గణేశ్​ మండపాలు!

Best Web Hosting Provider In India 2024


‘భక్తికి, విషాదానికి తేడా తెలియదా?’- ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్​తో గణేశ్​ మండపాలు!

Sharath Chitturi HT Telugu

ఎయిరిండియ విమాన ప్రమాదం థీమ్​తో నిర్మించిన రెండు గణేశ్​ మండపాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. “భక్తికి, విషాదానికి తేడా తెలియదా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్​తో గణేశ్​ మండపం! (Instagram/@aircrew.in)

యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన థీన్​తో రెండు చోట్ల మండపాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది! ఇలాంటి విషాదకర విషయాలను కూడా ఉపయోగించుకోవడం అమర్యాదకరం అని, అసహ్యకరం అని సోషల్​ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్​తో నిర్మించిన రెండు గణేశ్​ మండపాల్లో ఒకటి నాగ్‌పూర్‌లో, మరొకటి అహ్మదాబాద్‌లో ఉన్నాయి.

నాగ్‌పూర్ మండపం..

నాగ్‌పూర్‌లోని జరిపట్కాలోని మండపంలో, అహ్మదాబాద్‌లోని ఓ హాస్టల్ భవనాన్ని ఢీకొన్న విమానాన్ని పోలినట్టుగా ఒక 3డీ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ మండపం వీడియోలు ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అయ్యాయి.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :

అహ్మదాబాద్ మండపం..

అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ మండపం మరింత వివాదాస్పదంగా మారింది! ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని యథాతథంగా పునఃసృష్టించారు. కాలిపోయిన భవనాలు, సంఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బందిని కూడా ఇందులో చూపించారు.

ఈ మండపం వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

విమర్శలు, స్పందన..

ఈ మండపాలపై ఏవియేషన్ విశ్లేషకుడు వినమ్ర లాంగని తీవ్ర విమర్శలు చేశారు. “ఎయిరిండియా విమాన ప్రమాద థీమ్‌తో గణపతి మండపం ఏర్పాటు చేయడం సృజనాత్మకత కాదు. ఇది మృతుల పట్ల, వారి కుటుంబాల పట్ల, ఏవియేషన్ సమాజం పట్ల అత్యంత అమర్యాదకరమైన చర్య,” అని లాంగని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

సమర్థించుకున్న నిర్వాహకులు..

అయితే నాగ్‌పూర్‌లోని మండపం నిర్వాహకులు తమ చర్యను సమర్థించుకున్నారు! తమ ఉద్దేశం వివాదం సృష్టించడం కాదని, కేవలం ఒక సంకేతానికి చిహ్నంగానే ఇలా చేశామని వివరించారు.

“ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించాలనుకున్నాం. అలాగే, విపత్తులోనూ భక్తి మార్గాన్ని చూపుతుందని ప్రజలకు గుర్తు చేయాలనుకున్నాము,” అని మండప సభ్యుల్లో ఒకరు తెలిపారు. “ప్రమాదం జరిగిన ప్రదేశానికి బయట ఉన్న శిథిలాలు, లోపల ఉన్న గణపతి శాంత స్వరూపం బలాన్ని, ఏం జరిగినా జీవితం ముందుకెళుతుందనే విషయాన్ని సూచిస్తాయి,” అని ఆయన చెప్పారు.

సోషల్ మీడియాలో విమర్శలు..

ఈ ఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు మండపాల నిర్వాహకులను తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకదాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.

“ఇది చాలా సిగ్గుచేటు. దీనిపై నాగ్‌పూర్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి,” అని ఒక ‘ఎక్స్’ యూజర్ రాశారు.

“ఏదైనా కంటెంట్ కోసం వాడేస్తున్నట్టున్నారు.. ఇది చాలా అసహ్యం,” అని మరొకరు కామెంట్ చేశారు.

“భక్తికి, విషాదానికి మధ్య తేడాను మనం నిజంగా గుర్తించలేనంత మొద్దుబారిపోయామా?” అని ఒక వ్యక్తి ప్రశ్నించారు.

“ఇది థీమ్ కాదు! ఈ విషాదంలో చాలా కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి, ఇది వారిని మరింత బాధపెట్టవచ్చు,” అని మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

జూన్​లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 12 మంది సిబ్బంది, 230 మంది ప్రయాణికులలో 229 మంది మరణించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link