




Best Web Hosting Provider In India 2024

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం – సీఎం రేవంత్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రాణహిత – చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి వద్దనే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామన్నారు. కాళేశ్వరంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత – చేవెళ్లతో పాటు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై వైఎస్సార్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.
మంగళవారం హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ విప్లవ పితామహుడు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ చదలవాడ సుధా, డాక్టర్ చదలవాడ నాగేశ్వర రావుకు డా. వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక తొలి పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా అందజేశారు.
ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం – సీఎం రేవంత్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “వ్యవసాయం దండక కాదు పండుగ చేయాలన్న వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై తలపెట్టిన ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.రైతు సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే 25 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు.
- కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్ల కాలంలో బాధల నుంచి రైతులను కాపాడాలని 2007-08 లో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్సార్ పునరుజ్జీవం కల్పించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి ఆ ప్రాజెక్టును తప్పించారు.
- రైతాంగానికి మేలు చేయాలని, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, కొంత కొడంగల్ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలన్న వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల కడతాం. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్గొండ ప్రజలను రక్షించాలని సంకల్పించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
- రైతునే రాజును చేయాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం రైతాంగానికి ఉచిత విద్యుత్ కు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. 1300 కోట్ల రూపాయల మేరకు రైతుల బకాయిలను రద్దు చేశారు. దేశంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలంటే తప్పనిసరిగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకోకతప్పని రీతిలో అందరి మదిలో వారు స్థానం పదిలం చేసుకున్నారు.
- వైఎస్సార్ ఆలోచనల కొనసాగింపుగా వారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగిస్తున్నాం. వైఎస్ ఆలోచన, వారి స్ఫూర్తితోనే దేశంలోనే మొట్ట మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం.
- రైతు సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే 25 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి విముక్తులను చేశాం. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్న రోజుల నుంచి వరి వేసుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తామని ప్రోత్సహించాం. ఈరోజు దేశంలోనే అత్యధికంగా 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలిచాం.
- కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించని కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. పాలేకర్ గారు సూచించినట్టు మార్గంలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తాం.
- విద్యార్థి దశ నుంచి వైఎస్‌కు వెన్నంటి నిలిచిన మిత్రుడి కోసం కేవీపీ రామచంద్ర రావు తన శక్తినంతా ధారపోశారు. వైఎస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న సందర్భంలో కూడా వారి వెంట నిటారుగా నిలబడ్డారు. వైఎస్ మరణించి 16 సంవత్సరాలు పూర్తయినా, వారిపై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టాపిక్