



Best Web Hosting Provider In India 2024

కారు పార్టీలో కల్లోలం…! కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు….?
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ మీడియాతో మాట్లాడనున్న ఆమె…సస్పెన్షన్ పై స్పందించనుంది. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది…!
డైలాగ్ వార్….
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ… కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కన్న కుమార్తెను కూడా చూడకుండా… పార్టీ శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత… పోతే ఎంత అన్నట్లు..తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు హరీశ్ రావ్, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ జాగృతి నాయకులు ఆందోళన చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా… వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్, జాగృతి శ్రేణుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కవిత టార్గెట్ గా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు చేస్తుంటే… హరీశ్ రావ్ టార్గెట్ గా జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు పోస్టులు పెడుతున్నారు.
కవిత ప్రకటనపై ఉత్కంఠ…
తాజా పరిణామాల నేపథ్యంలో కవిత ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ నిర్ణయంపై స్పందించనున్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో… కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే జాగృతి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆమె….సొంతంగా పార్టీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ఒకటి రెండు పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేస్తారని తెలిసింది.
ఇవాళ మీడియాతో మాట్లాడనున్న కవిత… గతంలో మాదిరిగానే హరీశ్, సంతోష్ రావ్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తారా..? ఇంకా ఏమైనా సంచలన విషయాలు బయటపెడతారా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఇదే సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తిని రేపుతోంది.
గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కవిత… పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీసీ అంజెడాగా పలు కార్యక్రమాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.అయితే జాగృతి పేరుతోనే పార్టీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయనే విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తంగా కారు పార్టీలో అత్యంక కీలకంగా వ్యవహరించిన కవిత…. సస్పెన్షన్ వేటుకు గురికావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది..! అంతేకాకుండా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత కుమార్తె అయిన కవితను సస్పెండ్ చేయటం వంటి పరిణామాలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి..!
సంబంధిత కథనం
టాపిక్