





Best Web Hosting Provider In India 2024

షారుక్ రికార్డుపై రాజమౌళి కన్ను..ఏకంగా 120 దేశాల్లో మహేష్ బాబు సినిమా రిలీజ్.. లీక్ చేసిన కెన్యా మంత్రి.. పోస్టు వైరల్
ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారని కెన్యా మంత్రి పోస్టు ద్వారా లీక్ అయింది.
రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి లీక్ అయింది. ఈ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయాలని ఎస్ఎస్ రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
120 దేశాల్లో
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 100 దేశాల్లో విడుదలైన ఈ మూవీ అత్యధిక దేశాల్లో రిలీజైన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29తో రాజమౌళి- మహేష్ బాబు ఆ రికార్డు బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కెన్యా మంత్రి పోస్టు ప్రకారం ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది.
కెన్యాలో షూటింగ్
ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ క్రమంలో కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియాను రాజమౌళి కలిశారు. ఈ మీటింగ్ గురించి ఎక్స్ లో ముసాలియా పోస్టు పెట్టారు. ఇందులోనే 120 దేశాల్లో ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ చేయబోతున్నారని మినిస్టర్ తెలిపారు.
“కెన్యా గత పక్షం రోజుల్లో ప్రపంచంలోని గొప్ప దర్శకులలో ఒకరైన రాజమౌళికి వేదికగా నిలిచింది. ఆయన దార్శనిక భారతీయ దర్శకుడు, కథారచయిత, కథకుడు. ఆయన చిత్రాలు ఖండాల అంతటా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ ఉన్న రాజమౌళి.. శక్తివంతమైన కథనాలు, అద్భుతమైన దృశ్యాలు, లోతైన సాంస్కృతిక అనుభూతిని కలిగి ఉన్న చిత్రాలను తెరకెక్కించడంలో ప్రసిద్ధి చెందారు’’ అని కెన్యా మంత్రి పోస్టులో పేర్కొన్నారు.
బిలియన్ కంటే ఎక్కువ
‘‘120 మంది సిబ్బందితో కూడిన రాజమౌళి బృందం తూర్పు ఆఫ్రికాలో విస్తృతమైన షూటింగ్ ప్రదేశాలను పరిశీలించిన తర్వాత, ఆఫ్రికా దృశ్యాలలో దాదాపు 95% షూటింగ్ జరిగే ప్రధాన చిత్రీకరణ ప్రదేశంగా మా దేశాన్ని ఎంచుకుంది. మసాయి మారా విస్తారమైన మైదానాల నుండి సుందరమైన నైవాషా, కఠినమైన సంబురు, ఐకానిక్ అంబోసెలి వరకు కెన్యా ప్రకృతి దృశ్యాలు ఇప్పుడు ఆసియాలో అతిపెద్ద చిత్ర నిర్మాణంగా మారనున్న భాగమయ్యాయి. 120 దేశాల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకుంటుందని అంచనా’’ అని కెన్యా మంత్రి పోస్టులో తెలిపారు.
పఠాన్ రికార్డు
2024లో పఠాన్ మూవీ 100 కంటే ఎక్కువ దేశాల్లో రిలీజైంది. విదేశాల్లో 2,500 కంటే ఎక్కువ తెరలపై విడుదలైంది. దీని వలన భారీ ఓపెనింగ్ వచ్చింది. ఇండియాలో రూ.57 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.104.80 కోట్లు తొలి రోజు సేకరించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,050 కోట్లు సేకరించి, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
అడ్వెంచర్ థ్రిల్లర్
ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ఈ ఏడాది జనవరిలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇండియానా జోన్స్ తరహా యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రం నుంచి అధికారిక మొదటి ప్రకటన నవంబర్ 2025లో రానుంది.
సంబంధిత కథనం