




Best Web Hosting Provider In India 2024

‘రామన్న.. హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు, మన ఫ్యామిలీపై కుట్ర అంతా ఆయనేదే’ – కవిత సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావ్ టార్గెట్ గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావ్, సీఎం రేవంత్ కలిసి ఓకే విమానంలో ప్రయాణం చేశారని.. ఆ తర్వాతనే మా కుటుంబపై కుట్రలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావ్, సంతోష్ రావులను దూరం పెట్టాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. హరీశ్ రావ్, సీఎం రేవంత్ కలిసి ఓకే విమానంలో ప్రయాణం చేశారని.. ఆ తర్వాతనే మా కుటుంబపై కుట్రలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ తనను బయటికి పంపొచ్చని… రేపు కేటీఆర్ పై కూడా కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు.
నాన్న… కొంచెం చూసుకోండి – కవిత
“నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నా. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా. నాన్న.. మీ చుట్టు ఏం జరుగుతోంది చూస్కోండి. నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడడం పార్టీ వ్యతిరేకమా..? నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని కలిసి వివరాలు చెప్పా. కనీసం ఎలాంటి స్పందన రాలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా..? 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా..?” అని కవిత ప్రశ్నించారు.
హరీశ్ రావ్ బబుల్ మేకర్…
హరీశ్ రావ్ ట్రబుల్ షూటర్ కాదని.. బబుల్ మేకర్ అని కవిత కామెంట్స్ చేశారు. కాళేశ్వరంలో హరీశ్ రావ్ అవినీతికి పాల్పడ్డారని మరోసారి ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఎమ్మెల్యేలకు హరీశ్ రావ్ డబ్బులు ఇచ్చారని… ఆ డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని నిలదీశారు. సిరిసిల్లలో కేటీఆర్ ను, గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించే ప్రయత్నాలు కూడా చేశారని ఆరోపించారు.
“నా ప్రాణం పోయినా సరే కేసీఆర్, కేటీఆర్ కు హానీ జరగాలని నేను కోరుకోను. ఇవన్నీ కూడా ఆవేదనతో మాట్లాడుతున్నాను. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్లతో హరీశ్ రావ్ మాట్లాడారు. రెండో అభ్యర్థిని బరిలో ఉంచాలని రాయబరాలు నడిపారు. కేటీఆర్ ను ఒక్కటే కోరుతున్నాను… పార్టీని కాపాడుకోండి. కేసీఆర్ ఆరోగ్యాన్ని చూసుకోండి” అని కవిత కోరారు.
“హరీశ్ రావ్ వల్లనే పార్టీ నుంచి కీలక నేతలంగా బయటికి వెళ్లిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను మ్యానేజ్ చేయటంలో హరీశ్ రావ్ దిట్ట. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ ను గెలిపించిందే హరీశ్ రావ్. హరీశ్ రావ్ నక్క జిత్తులను గమనించాలని కేసీఆర్ ను కోరుతున్నాను. ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు” అని కవిత ఎద్దేవా చేశారు.
“కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న రేవంత్.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు. ఆయన పాల వ్యాపారం నుంచి అనేక అంశాలపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ వెంటనే కనిపించకుండా పోయాయి. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం” అని కవిత ఆరోపించారు.
“నాన్న..! రామన్న..! జాగ్రత్తా..! సంతోష్ హరీష్ రావ్ మీ కీడు కోరుకునే వ్యక్తులు. మన ఫ్యామిలపై కుట్ర చేసి.. పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళని పక్కనబెడితేనే పార్టీ బతుకుతుంది. రేవంత్ రెడ్డి, హరీశ్ రావ్ మధ్య ఏళ్లనాటి సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ ఒకటే. సంతోష్ ధన దాహానికి అంతులేదు..! సిరిసిల్ల పరిధిలో ఇసుక లారీ వల్ల ప్రమాదం జరిగితే ఏడుగురు యువకులను థర్డ్ డిగ్రీతో కాళ్ళు చేతులు లేవకుండా చేయించాడు. సంతోష్ చేసిన పాపానికి రామన్న ఇబ్బంది పడాల్సి వచ్చింది” అని కవిత చెప్పుకొచ్చారు.
“రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు దన దాహం ఎక్కువ. హరిత హారానికి వ్యతిరేకంగా గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టాడు. సినిమా వాళ్లను తీసుకొచ్చి ఫొటోలు దిగుతూ… అటవీ భూములను కొట్టేసే ప్రయత్నాలు చేశాడు. ఆయన మిత్రుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వందల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..? మెకిలాలో భారీ ప్రాజెక్ట్ ను ఎలా చేపట్టారు..? ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయి..? ఈ వివరాలను మా పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే చెప్పాడు” అని కవిత వివరించారు.
ఏ పార్టీలో చేరబోను – కవిత
ఇక సస్పెన్షన్ కు గురైన కవిత… బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాను పంపించారు. ఇక తను ఏ పార్టీలో చేరబోనని కవిత స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి… ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
సంబంధిత కథనం
టాపిక్