




Best Web Hosting Provider In India 2024

తిరుపతికి వెళ్తున్నారా? త్వరలో సీ ప్లేన్ సర్వీసులు.. నీటిపై తేలుతూ గాలిలో విహరిస్తూ!
తిరుపతి సందర్శించే శ్రీనివాసుడి భక్తులు రోజు లక్షల్లో ఉంటారు. ఇకపై వీరు కొత్త అనుభూతి కూడా పొందొచ్చు. అది ఏంటంటే సీ ప్లేన్ రైడ్ చేయవచ్చు. నేరుగా నీటిపై వెళ్లవచ్చు.
తిరుపతి సందర్శించే యాత్రికులు, పర్యాటకులు త్వరలో సీప్లేన్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత ఏరోడ్రోమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. జల విమానాశ్రయం అన్నమాట. సాహసం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ వచ్చే మార్చి నాటికి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.
ప్రాంతీయ విమానయాన సేవలను అనుసంధానాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ సేవల కోసం ఎనిమిది ప్రదేశాలను ప్రతిపాదించింది. వాటిలో అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, రుషికొండ ఉన్నాయి. వీటిలో అమరావతి, తిరుపతి మరియు గండికోట మొదటి దశకు షార్ట్‌లిస్ట్ అయ్యాయి.
ప్రాజెక్టులకు సాంకేతిక-సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) బిడ్లను ఆహ్వానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు, రెగ్యూలర్‌గా పనిచేసే విమానాశ్రయాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ మూడు ప్రదేశాలను మెుదటి దశలో ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
అమరావతి, గండికోటకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నారు. అయితే తిరుపతి ప్రాజెక్టుపై అధ్యయనం చేసే బాధ్యతను ఫీడ్‌బ్యాక్ హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. కళ్యాణి ఆనకట్ట కోసం ఈ సంస్థ డీపీఆర్‌ను ఖరారు చేస్తోంది. సాంకేతిక, ఆర్థిక అనుమతులు పొందిన తర్వాత ఏరోడ్రోమ్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ రిజర్వాయర్ సురక్షితమైన నీటి ఆధారిత ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లకు సరైన పరిస్థితులను అందిస్తుందని పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా పర్యాటకంగా తిరుపతి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ప్రాచూర్యం పొందాయన్నారు.
తిరుమల కొండల దిగువన ఉన్న సహజ వాతావరణం, చంద్రగిరి కోట, ఇతర పర్యాటక ప్రదేశాలు సమీపంలో ఉండటం, రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర ఉండటంతో నిపుణులు ఈ స్థలాన్ని అనువైనదిగా భావించారు. ఈ ప్రాజెక్ట్‌తో తిరుపతి టూరిజం దశ మారుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
తిరుపతికి ఇప్పటికే ప్రతి నెలా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారు. సీప్లేన్ కూడా వస్తే.. దేశంలోనే మరింత ఆకర్శణియంగా ఉంటుందని చెబుతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ట్రయల్ రన్‌లు ప్రారంభమవుతాయి. మార్చి చివరి నాటికి మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ సందర్శకుల సంఖ్యను పెంచడమే కాకుండా.. భక్తి, వారసత్వం, సాహసాలను ఒక్కే చోటే అందించే గమ్యస్థానం కానుంది.
టాపిక్