




Best Web Hosting Provider In India 2024

మీ ఫ్యామిలీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతారు : కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్ రియాక్షన్
బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేరు కూడా ఆమె ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందించారు.
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కవిత మీడియా సమావేశం పెట్టి హరీశ్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నష్టం అని కవిత వ్యాఖ్యానించారు. అంతేకాదు కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని సూటిగా ప్రశ్నించారు. వీరి వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అని పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనిపై మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, సంతోష్ రావులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏసీబీకి హరీశ్ రావు, సంతోష్ రావు ఇళ్లు దొరకట్లేదా.. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అడిగారు.
మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్‌కు పడుతుందన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటున్నారని సీఎం అన్నారు. మీ కుటుంబ పంచాయితీల్లోకి తనను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
‘నాయకుడు ఎవరి వెనక ఉండడు. నేను ప్రజల ముందే ఉంటాను. విపరీతంగా అవినీతి సొమ్ము సంపాదించారు. అందుకే కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసం వివాదాలు వస్తున్నాయి. పాపం ఊరికే పోదు.. చేసుకున్న వారికి చేసుకున్నంత. వాళ్లలో వాళ్లే తన్నుకుని చస్తున్నారు. ఒకరి వెనక ఒకరు ఉన్నారని కొందరు అంటున్నారు. అంత చెత్తగాళ్ల వెనక నేనెందుకు ఉంటాను. వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీశ్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరు అంటున్నారు. తెలంగాణ ప్రజలు చీదరించుకున్న మీ వెనకాల అన్నం తినేవారు ఎవరైనా ఉంటారా. దయచేసి మీ కుటుంబ పంచాయితీలోనో.. మీ కుల పంచాయితీలోనో.. మమ్మల్ని లాగకండి.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా ఇండిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేశామన్నారు. కరువు, వలసలు ఆగాలంటే మన పిల్లలకు నాణ్యమైన విద్య అందాలన్నారు. మన తలరాతను మార్చేది ఒకే ఒక్కటి విద్య అని చెప్పారు.
‘మాజీ సీఎం ఈ జిల్లా ప్రాజెక్టులను తొక్కిపెట్టారు. ఆ నాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ముందుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పూర్తికాలేదు. పాలమూరు బిడ్డలు లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తుంది.’ అని సీఎం రేవంత్ అన్నారు.
టాపిక్